‘మా ఇష్టం...అంతా మా ఇష్టం’ అంటున్న చంద్రబాబు

Update: 2018-04-22 12:25 GMT

ఏపీలో పాలన ‘దారితప్పుతోంది. అది ఇప్పుడు కొత్త కాకపోయినా ఈ మధ్య కాలం ఈ ట్రెండ్ మరింత ఎక్కువ పెరిగిందనే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మొదలుకుని ఆయా శాఖల ఉన్నతాధికారుల మాటలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డోంట్ కేర్ అంటున్నాయి. మా ఇష్టం..అంతా మా ఇష్టం అన్న చందంగా ఆయన పాలన సాగుతోంది. చంద్రబాబులాంటి సీనియర్ నేత నుంచి ఎవరైనా ఈ తరహా పాలన ఆశిస్తారా?. పుట్టా సుధాకర్ యాదవ్ వివాదాన్ని కాసేపు పక్కన పెడితే...తాజాగా వెలుగులోకి వచ్చిన అనిత వీడియో పెద్ద దుమారమే రేపింది. కోట్లాది మంది ఉన్న వెంకటేశ్వరస్వామి భక్తుల్లో ఒకింత అలజడినే రేపింది. ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తాను క్రిస్టియన్ ని అని..తన కారులో..బ్యాగులో బైబిల్ ఉంటుందని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు ఈ వివాదంపై దృష్టి సారించారట. తిరుమల వంటి ఎంతో ప్రాచుర్యం ఉన్న దేవాలయాలకు సంబంధించిన అంశాలపై ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎవరైనా అన్ని విషయాలను ముందే సరిచూసుకుని....రికార్డు క్లీన్ గా ఉంటేనే టీటీడీ లాంటి బోర్డులో సభ్యులను నియమించాలి.

ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వ్యవస్థకు బాధ్యతలు అప్పగిస్తే ఒక్క రోజులో ఎవరి వివరాలు ఏమిటో తేవటం పెద్ద కష్టం కాదు. కానీ అనితను టీటీడీ బోర్డు సభ్యురాలిగా నియమించి..ఇప్పుడు చంద్రబాబు దీనిపై నివేదిక కోరారు...దిద్దుబాటు తప్పదు అనే సంకేతాలు పంపుతున్నారు. చంద్రబాబులాంటి సీనియర్ ఇంత సున్నితమైన అంశాల్లో ఏ మాత్రం లోతుగా పరిశీలించకుండా అలవోకగా..ఆయన ఏది అనుకుంటే అదే నిర్ణయాలు తీసుకుంటున్నారనే విషయాన్ని తాజా ఉదంతం కూడా నిరూపిస్తోంది. ఇదొక్కటే కాదు..పరిపాలనా అంశాల్లోనూ అధికారుల మాటకు ఏ మాత్రం విలువ ఇవ్వకుండా..అన్నీ కేబినెట్ లో పెట్టేసి..అక్రమాలకు కూడా ఆమోదముద్ర వేసుకుంటున్న విషయం తెలిసిందే. మాట్లాడితే రాజకీయాల్లో ప్రధాని మోడీ కంటే నేనే సీనియర్. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ రికార్డు. రాష్ట్రంలోనే కాదు..దేశంలో నేనే సీనియర్ రాజకీయవేత్తను.’ అంటారు. మరి ఇంత సీనియర్ నేత పాలన అంటే ఎలా ఉండాలి? ఎవరూ ఒక్క తప్పు జరిగింది అని వేలెత్తి చూపటానికి ఉండకూడదు కదా. పాలన అంతా సాఫీగా చేయాలి. కానీ చంద్రబాబు చేస్తున్న పాలన అంతా రివర్స్ లో ఉందని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. చంద్రబాబు పాలన ఒక్క తప్పు వెతకటం కాదు...అందులో మంచిని వెతకటమే కష్టం అన్న చందంగా తయారైందని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు.

 

 

Similar News