వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందవు. ఎన్నికలు రావు. ఎవరైనా పార్లమెంట్ అయిపోయాక రాజీనామాలు చేస్తారా?. అంతా ప్లాన్ ప్రకారమే చేస్తున్నారు. ఎలాగూ ఎన్నికలు రావనే వైసీపీ ఎంపీల రాజీనామాల నిర్ణయం తీసుకుంది. ఇదీ ముఖ్యమంత్రి చంద్రబాబాయుడు మొదలుకుని టీడీపీ మంత్రులు..ఎంపీలు పదే పదే చేసే విమర్శ. మరి అదే నిజం అయినప్పుడు అధికార తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా రాజీనామా చేయవచ్చు కదా?. వాళ్లు చెబుతున్నదే నిజం అయినప్పుడు ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందకపోతే టీడీపీ ఎంపీలు కూడా ఆ దిశగా పయనిస్తే ఆ క్రెడిట్ వారికి కూడా దక్కుతుంది కదా?. ఇఫ్పటికే కేంద్రం నుంచి మంత్రులను ఉపసంహరింపచేసి...ఎన్డీయే నుంచి బయటికొచ్చి ‘ప్రత్యేక హోదా’ ఛాంపియన్లుగా చెప్పుకుంటున్న టీడీపీ ఎంపీల రాజీనామా పని కూడా చేస్తే ప్రజల్లో మరింత సానుభూతి వస్తుంది కదా?. నిజంగా టీడీపీ నేతలు చెబుతున్నట్లు వైసీపీ ఎంపీలకు ఏదైనా రాజీ ఫార్ములా ఉందనుకుంటే వాళ్ళ రాజీనామాలు ఆమోదించకుండా...టీడీపీ ఎంపీల రాజీనామాలను స్పీకర్ ఆమోదించలేరు కదా?. నిజంగా అలా చేస్తే అంతకంటే కావాల్సింది ఏముంది టీడీపీకి. దేశ వ్యాప్తంగా బిజెపి తీరు బహిర్గతం అవుతుంది. అంటే అధికార టీడీపీ ఎంపీలు తమ పదవులను వదులుకోవటానకి సిద్ధంగా లేరన్న మాట.
ఇదే విషయంపై చంద్రబాబును ఢిల్లీలో మీడియా ప్రశ్నిస్తే రాజీనామాలు చేస్తే ఎవరు పోరాడతారు అని ప్రశ్నించారు. నాలుగేళ్ళు కేంద్ర ప్రభుత్వంలో కొనసాగి...పార్లమెంట్ లో పోరాడి సాధించింది ఏమిటి?. నిన్న మొన్నటి వరకూ హోదా కంటే ప్యాకేజీ బెస్ట్ అంటూ చంద్రబాబు మొదలుకుని మంత్రుల వరకూ వాదించిన విషయం తెలిసేందే. అసలు ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి ఏమి వస్తాయో తనను ఎడ్యుకేట్ చేయండని కూడా చంద్రబాబు బహిరంగంగా వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం ఇప్పుడు పోరాటబాట పట్టారు. చూడాలి ఈ రాజకీయాలు ఎన్ని మలుపులు తిరుగుతాయో.