ఓ ప్రెస్ కాన్ఫరెన్స్. మరో నలభై ఫోటో సెషన్స్. మళ్ళీ అవే పాత కథలు. ఎక్కడా ప్రత్యేక భేటీలు లేవు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన తొలి రోజు సెంట్రల్ హాల్ అక్కడ ఉన్న నేతలతో భేటీలే. కన్పించిన వారితో ఫోటోలు. మురళీ మనోహర్ జోషి ఏపీ డిమాండ్లకు సానుకూలంగా స్పందించారు. వాస్తవంగా మాట్లాడుకుంటే ఆయన స్పందించినా..స్పందించకపోయినా పెద్దగా ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఆయన్నే ప్రధాని నరేంద్రమోడీ పక్కన పెట్టారు. హేమామాలిని..సుప్రియ సూలేలతో చర్చలు. శరద్ పవార్ తోనూ సెంట్రల్ హాల్ లోనే భేటీ. వెరసి ఎవరూ కూడా చంద్రబాబు చెప్పినవన్ని నిజాలే..ఏపీకి మోడీ అన్యాయం చేస్తున్నారు అని బయటికి వచ్చి చెప్పింది లేదు. ఎవరైనా సరే..అదీ ఓ ముఖ్యమంత్రి కలిసి తమ సమస్యలు చెప్పుకుంటే కాదంటారా?. ఇప్పుడు చంద్రబాబు టూర్ లోనే జరిగింది అదే. రెండవ రోజు చంద్రబాబు అసలు పార్లమెంట్ వైపే చూడలేదు. ఈ వ్యవహారం అంతా చూస్తుంటే చంద్రబాబు జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వటానికే ఢిల్లీ వెళ్లినట్లు ఉంది తప్ప...మరొక ఫలితం ఏమీ కన్పించలేదు.
కనీసం లోక్ సభలో ఆందోళన చేస్తున్న అన్నాడీఎంకె ఎంపీలను ఒప్పించి..అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చేలా చేయటంలో కూడా చంద్రబాబు విఫలమయ్యారు. నికరంగా చంద్రబాబు ఢిల్లీ టూర్ ఏపీకి ఏమైనా మిగిల్చిందా? అంటే ఏమీలేదనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. చంద్రబాబు చెప్పినట్లు నిజమే ఏపీని ప్రధాని నరేంద్రమోడీ అన్యాయం చేసినట్లే. మరి ఇదే చంద్రబాబు నాలుగేళ్ళ పాటు కేంద్రానికి పూర్తి అండదండలు అందించి..ఎవరైనా విమర్శిస్తే వారిపై ఎదురుదాడిన చేసిన దాంట్లో ఆయన పాత్రలేదా? ఢిల్లీ టూర్ లోనూ చంద్రబాబు తన ఏజెండాను బహిర్గతం చేశారు. తొలి రోజు మాట్లాడుతూ అవినీతి పార్టీని బిజెపి దగ్గరకు తీసుకున్నందుకే బయటకు వచ్చినట్లు వ్యాఖ్యానించారు. వారం వారం కోర్టుకు హాజరయ్యే వారికి పీఎంవోలో అంత సులభంగా యాక్సెస్ ఎలా దొరుకుతుందని అంటూ తన మనసులో మాటను బయటపెట్టారు. నెరవేరితే చంద్రబాబు రాజకీయ లక్ష్యాలు నెరివేరి ఉంటాయి కానీ...రాష్ట్ర లక్ష్యాలు మాత్రం ఏమీ నెరవేరలేదనే చెప్పొచ్చు.