ఏపీలో బయోపిక్ ల ‘రాజకీయం’

Update: 2018-04-06 16:27 GMT

ఎన్నికలకు ఇంకా ఏడాదే సమయం ఉండటంతో ప్రధాన పార్టీలు అన్నీ ‘బయోపిక్ ల రాజకీయం’ మొదలుపెట్టాయి. ఇప్పటికే బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాను ఈ సంవత్సరాంతానికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. సినీ రంగంలో ఓ వెలుగు వెలిగిన ఎన్టీఆర్ చరిత్రతోపాటు..రాజకీయాల్లోకి ప్రవేశించిన అతి తక్కువ సమయంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన వైనాన్నిఈ బయోపిక్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వివాస్పద అంశాలకు జోలికి వెళ్లకుండా ఎన్టీఆర్ సీఎం అయిన విషయంతోనే ఈ సినిమాను క్లోజ్ చేయనున్నారని ఫిల్మ్ నగర్ టాక్. వచ్చే ఎన్నికల సమయంలో విడుదల అయ్యే ఈ సినిమాతో అధికార టీడీపీకి ఎంతో కొంత ఉపయోగం ఉంటుందని రాజకీయ వర్గాల అంచనా. ఇప్పుడు వైఎస్ బయోపిక్ అంశం కూడా అధికారికం అయింది.

మళయాళ సూపర్ స్టార్ మమ్ముటి హీరోగా వైఎస్ బయోపిక్ తెరకెక్కనుంది. దీనికి ‘యాత్ర’ అనే పేరు పెట్టారు. ఏప్రిల్‌ 9 నుంచి ఈ చిత్రం షూటింగ్‌ మొదలుకాబోతోంది. దర్శకుడు మహీ వి రాఘవ్‌ యాత్రను తెరకెక్కించబోతున్నారు. ఒక్క అడుగుతో చర్రిత సృష్టించే బదులు.. జనాల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి అన్న ఇంగ్లీష్‌ కాప్షన్‌ను.. ‘కడప దాటీ ప్రతీ గడపలోకి వస్తున్నాను. మీతో కలిసి నడవాలనుంది. మీ గుండెచప్పుడు వినాలనుంది’.. అన్న సందేశంతో థీమ్‌ లోగోను ఆవిష్కరించారు. వైఎస్‌ఆర్‌ పాదయాత్రకు సంబంధించిన విషయాలను చిత్రంలో ప్రధానాంశంగా చూపించబోతున్నారు. వైఎస్ ప్రవేశపెట్టిన పలు పథకాలు ప్రజలను విశేషంగా ఆకర్షించిన విషయం తెలిసిందే. మరి ఈ బయోపిక్ లు ఆయా పార్టీలకు ఏ మేరకు రాజకీయంగా మేలు చేకూర్చిపెడతాయో వేచిచూడాల్సిందే.

 

 

 

Similar News