ఏపీ నెత్తిన 4000 కోట్ల భారం మోపిన చంద్రబాబు!

Update: 2018-04-07 05:04 GMT

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్ని సినిమాలు చూపించారో..అమరావతి-అనంతపురం ఎక్స్ ప్రెస్ వే రహదారిపై కూడా అంతే హడావుడి చేశారు. అసలు ఇక అనంతపురంలో బయలుదేరితే అమరావతికి ఆగమేఘాల మీద రావచ్చని..ఈ రహదారి జెట్ స్పీడ్ తో పూర్తవుతుందని అంటూ హంగామా చేశారు. కానీ ఇంతవరకూ అత్యంత కీలకం అయిన ఈ రహదారి పనులు అడుగు ముందుకు పడిన దాఖలాలు కూడా లేవు. పైగా ఓ వైపు కేంద్రం రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా అన్యాయం చేస్తుందని పదే పదే ఆరోపిస్తున్న ముఖ్యమంత్ర చంద్రబాబునాయుడు ఏకంగా రాష్ట్రంపై దాదాపు 4000 కోట్ల రూపాయల మేర అదనపు భారం మోపటానికి రెడీ అయ్యారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూ సేకరణను రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందని ఏపీ సర్కారు లిఖితపూర్వకంగా కేంద్రానికి లేఖ రాసింది. దీంతో సర్కారుపై మూడు వేల నుంచి నాలుగు వేల కోట్ల రూపాయల భారం పడనుంది. సర్కారు తీరుపై అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. వాస్తవానికి ఈ ప్రాజెక్టు వ్యయం మొత్తాన్ని కేంద్రం భరించానికి తొలుత అంగీకరించింది. కానీ సర్కారు కాంట్రాక్ట్ ల అప్పగింతతోపాటు పలు అంశాల్లో తమ అస్మదీయులను రంగంలోకి దించి..వేగంగా పనులు పూర్తి చేయటానికి అంటూ భూ సేకరణను తన నెత్తిన పెట్టుకుంది.

ఇది ఇప్పుడు ఏపీకి గుదిబండగా మారనుంది. అంటే సర్కారు ఈ రహదారికి అవసరమైన భూసేకరణ చేస్తే తప్ప...అమరావతిని రాయలసీమకు అనుసంధానం చేసే అత్యంత కీలకమైన ఈ రోడ్డు పనులు ముందుకు సాగటం కష్టమే అని ఆర్అండ్ బి శాఖ వర్గాలు చెబుతున్నాయి. అమరావతికి రాయలసీమ నుంచి మెరుగైన కనెక్టివిటి కోసం 371 కిలోమీటర్ల నిడివితో ఎక్స్ ప్రెస్ వేను తలపెట్టారు. ఎలాంటి మలుపులు లేకుండా నేరుగా ఈ రహదారిని నిర్మించాలని ప్రతిపాదించారు. ఇది కొంత అటవీ మార్గంలో కూడా ఉంది. దీనికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సిద్ధం చేశారు. కేంద్రానికి సమర్పించారు కూడా. ఈ రోడ్డు నిర్మాణానికి మొత్తం సుమారు 27,635 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు. కానీ ఏపీ సర్కారు రాష్ట్రం నెత్తిన అదనంగా నాలుగు వేల కోట్ల భారం మోపటంతో ఈ రహదారి ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అదే రాష్ట్ర సర్కారు ఈ లేఖ రాయకుండా ఉండి ఉంటే కేంద్రమే ఈ పనిచేసి..ప్రాజెక్టు మొదలు పెట్టాల్సి వచ్చేది.

 

 

 

Similar News