రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఎంఐఎం మద్దతు

Update: 2018-03-10 07:24 GMT

తెలంగాణ కాంగ్రెస్ కు షాక్. రాజ్యసభ రేసులో అభ్యర్థిని నిలబెట్టి..ఎంఐఎం మద్దతు కోరాలని నిర్ణయించిన ఆ పార్టీకి ఎంఐఎం ఝలక్ ఇచ్చింది. రాజ్యసభ ఎన్నికల్లో తాము టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వనున్నట్లు ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ట్విట్టర్ లో స్పష్టం చేశారు. దీంతో కాంగ్రెస్ ఆశలకు గండికొట్టినట్లు అయింది. కాంగ్రెస్ అభ్యర్థిని బరిలో దింపితే ఎన్నికలు అనివార్యం కానున్నాయి. తెలంగాణ నుంచి వచ్చే మూడు సీట్లను టీఆర్ఎస్ ఈజీగా గెలుచుకోనుంది. కాకపోతే ఏకపక్షంగా..టీఆర్ఎస్ కు ఆ ఛాన్స్ ఎందుకు ఇవ్వాలనే యోచనలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఉంది. అందుకే బరిలో ఉంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ నెల 23న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 12 నామినేషన్లకు ఆఖరి తేదీ. 13న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్లు ఉపసంహరణకు గడువు 15 వరకు ఉంది. 23న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు పోలింగ్‌ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్లను లెక్కించి ఫలితాలు విడుదల చేస్తారు. ఐఎంఎం అధికార టీఆర్ఎస్ అడగకముందే మద్దతు ప్రకటించటం విశేషం.

 

 

 

 

Similar News