ఎన్డీయేకు రాం రాం చెప్పిన తెలుగుదేశం పార్టీపై బిజెపి ఎటాక్ ప్రారంభించింది. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పుడు కేంద్రంపై నెపం నెడుతున్నారని బిజెపి అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి గెలిచే శక్తిలేదని అందుకే ఏమీ చేయలేని పరిస్థితిలో కేంద్రంపై అనవసర ఆరోపణలు చేస్తోందని ఆయన శుక్రవారమిక్కడ ఢిల్లీలో తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. టీడీపీ వైదొలగడం తమకొక మంచి అవకాశం అని, తమ వ్యూహాలను త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు.
ఇన్ని రోజులు కేంద్రంలో ఉండికూడా రాష్ట్రానికి ఏం చేయలేని చేతకాని ముఖ్యమంత్రి చంద్రబాబు అని, త్వరలోని ఆయన కుట్రలు, మోసాలు, అవినీతి బయట పెడతామని జీవీఎల్ హెచ్చరించారు. ఏపీలో టీడీపీని ఎదుర్కునే శక్తి బీజేపీకి ఉందని, రాష్ట్రంలో గెలవలేనివారు ఢిల్లీలో ఏం చేయగలరని ఆయన సూటిగా ప్రశ్నించారు. తమ చేతగాని తనాన్ని బీజేపీపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని, నాలుగేళ్లల్లో రాష్ట్రాన్ని అవినీతి మయంగా మార్చారని దుయ్యబట్టారు.