సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి పి. మధును ఆ పదవి నుంచి తప్పిస్తారా?. అంటే అవునంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. ఉమ్మడి రాష్ట్రంలో తొలి ఎస్ఎఫ్ఐ కార్యదర్శిగా పనిచేసిన ఆయన అంచలంచెలుగా ఎదిగి పార్టీలో పలు పదవులు అధిష్టించారు. అయితే మధు వ్యవహారశైలి పార్టీ నేతల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆయన వ్యవహారశైలిపై పలు జిల్లా నేతలు ఫిర్యాదులు కూడా చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నేతలతోనూ అభ్యంతరకర భాషలో మాట్లాడటం జిల్లాల్లోని పార్టీ నేతలకు ఏ మాత్రం రుచించటం లేదు. కొద్ది రోజుల క్రితమే వాస్తవానికి మధును తొలగించాలని నిర్ణయించినా..కొంత మంది నాయకులు అడ్డం పడ్డారు. అయితే ఏప్రిల్ 14 నుంచి హైదరాబాద్ లో జరిగే సీపీఎం అఖిలభారత మహాసభల సమయంలో ఆయన్ను మార్చే అవకాశం ఉందని సమాచారం.
పి. మధు స్థానంలో కొత్త కార్యదర్శిగా ఇటీవల వరకూ కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యుడుగా ఉన్న వి. శ్రీనివాసరావును నియమించే అవకాశం ఉందని సమాచారం. ఆయనకు అసలు ఈ పోస్టు ఇఛ్చేందుకే కేంద్రం నుంచి రాష్ట్రానికి పంపారని..అయితే కొంత మంది ఈ నియామకాన్ని అడ్డుకున్నారని సమాచారం. ఏపీలో సీపీఎం జిల్లా కమిటీలను రెండుగా చేయటం కూడా కొంత మంది నేతలకు ఇబ్బందిగా మారిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మధు కేవలం తన వ్యవహారశైలి కారణంతోనే పదవి పొగొట్టుకోవాల్సి వస్తోందని చెబుతున్నారు.