జగన్ కోసం మోడీ నిర్ణయం మార్చుకుంటారా!

Update: 2018-01-23 04:53 GMT

ప్రత్యేక హోదా ఇస్తే బిజెపికి మద్దతు ఇస్తామంటూ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన ఏపీ రాజకీయాల్లో మళ్లీ కొత్త చర్చను లేవనెత్తింది. కలసి పోటీచేసిన చంద్రబాబును కాదని..జగన్ కోసం మోడీ ప్రత్యేక హోదా ఇస్తారా?. అంటే ఖచ్చితంగా అది జరిగే పనికాదనే చెప్పొచ్చు.ప్రస్తుతం మోడీ, చంద్రబాబుల మధ్య సఖ్యత లేకపోయినా ఇది ఏ మాత్రం జరగదని విషయం అందరికీ తెలిసిందే. ఒక వేళ రాజకీయ కోణంలో మోడీ అందుకు అంగీకరిస్తారనుకున్నా...ఆ నిర్ణయంతో ఇఫ్పటికే ఏపీలో అడుగంటిన మోడీ, బిజెపి ప్రతిష్ట మరింత మసకబారటం ఖాయం. బిజెపి, మోడీ పేరు ఎత్తితే చాలు ఏపీ ప్రజలు ఆవేశంతో ఊగిపోయే పరిస్థితి ఉంది. అలా అని రోడ్డెక్కి ధర్నాలు చేయకపోయినా వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని ఆ మేర దెబ్బ తీసేందుకు ప్రయత్నం చేస్తారనటంలో సందేహం లేదు.

ఏపీలో అందరూ బిజెపిపై గుర్రుగా ఉన్న సమయంలో ప్రత్యేక హోదా ఇస్తే బిజెపికి మద్దతు ఇస్తానని జగన్ ప్రకటించటం రాజకీయంగా సరైన చర్య కాదనే అభిప్రాయాలు వైసీపీ వర్గాల నుంచే వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ ఓటు బ్యాంకు అంతా సహజంగానే బిజెపి వ్యతిరేకంగా ఉండే వర్గాలు ఉన్నాయి. దీనికి తోడు కేంద్రం విభజన తర్వాత ఆంధ్ర్రప్రదేశ్ కు సరైన రీతిలో సాయం చేయటంలేదనే భావన ఏపీలోని మెజారిటీ ప్రజల్లో ఉంది. ప్రత్యేక హోదా ఇస్తే బిజెపికి మద్దతు ఇస్తానన్న జగన్ వ్యాఖ్యలను సహజంగానే అధికార టీడీపీ పార్టీ జగన్ కేసులకు లింక్ పెట్టి దాడి చేయటం ఖాయం. అయితే హోదాకు, మద్దతుకు లింక్ పెట్టిన జగన్ గతంలో ప్రకటించిన తమ ఎంపీల రాజీనామా అంశాన్ని పక్కన పెట్టేశారు. తాజా ప్రకటనతో పాటు...గతంలో హోదా కోసం తమ ఎంపీలు రాజీనామా చేస్తారని ప్రకటించి..వెనక్కి తగ్గటం కూడా జగన్ ను ఇరాకటంలో పడేసే అంశాలు. హోదా బదులు బెస్ట్ ప్యాకేజీ వస్తుందని నమ్మించిన చంద్రబాబు అండ్ కో ఏపీ ప్రజలను నమ్మించి ఇఫ్పుడు పూర్తి స్థాయిలో ఇరకాటంలో పడ్డా ..దానిని రాజకీయంగా ఉపయోగించుకోవాల్సిన జగన్..తన వ్యాఖ్యలతో మరోసారి టీడీపీకి అస్త్రాలు అందించినట్లు అవుతుందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

 

 

Similar News