అప్పుడే మహానటి విడుదల తేదీ వచ్చేసింది. వచ్చే ఏడాది మార్చి 29న సినిమా విడుదల చేయనున్నట్లు బుధవారం నాడు ‘సర్ ప్రైజ్’ కింద విడుదల చేసిన వీడియోలో పేర్కొన్నారు. సావిత్రి జీవితకథ ఆధారంగా మహానటి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎవడే సుబ్రమణ్యం ఫేం నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అశ్వినిదత్ కూతురు స్వప్నా దత్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సావిత్రి పుట్టిన రోజు సందర్భంగా మహానటి చిత్రానికి సంబంధించి ఓ సర్ ప్రైజ్‌ను అభిమానులకు అందించారు. సావిత్రి అభిమానుల కోసం మహానటి లోగో వీడియోను విడుదల చేశారు.
ఈ వీడియోలో సావిత్రి నటించిన సినిమాలోని కొన్ని డైలాగులు ఉన్నాయి. మాయాబజార్ సినిమాలో ఉన్న మాయాపేటికను ఓపెన్ చేయగానే.. సమ్ స్టోరీస్ ఆర్ మీన్ టుబీ ఎపిక్ అంటూ.. మహానటి లోగో వస్తుంది. మహానటి లోగో ప్లే అవుతుంటే వచ్చే మ్యూజిక్ అందరిని ఆకట్టుకుంటోంది. మహాకావ్యంలాంటి ఓ చారిత్రక సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉంది అంటూ మహానటి లోగోకు సంబంధించిన వీడియోను కీర్తి సురేష్ ట్వీట్ చేశారు. సమంత మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మోహన్‌బాబు.. ఎస్వీఆర్ పాత్రలో, దుల్కర్ సల్మాన్.. జెమినీ గణేషన్ పాత్రలో నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్, విజయ్, షాలిని పాండే, ప్రగ్యా జైస్వాల్, మాళవికా నాయర్ లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
లోగో రిలీజ్ వీడియో
https://www.youtube.com/watch?v=iZ1fcWtFZtw