రాజకీయాల్లో ఎన్నో సంచలనాలు నమోదు చేసిన నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ సినిమా షూటింగ్ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ గా ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు చాలా గ్యాప్ తర్వాత నేనే రాజు..నేనే మంత్రి సినిమాతో మంచి హిట్ అందుకున్న తేజ దర్శకత్వం వహించనున్నారు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర సినిమాను సరిగ్గా వచ్చే ఎన్నికల సమయానికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడుతుందని ఓ అంచనా. వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా లక్ష్మీపార్వతి కోణంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తెరకెక్కించనున్న విషయం తెలిసిందే.
వచ్చే జనవరి 18న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా బాలకృష్ణ ఎన్టీఆర్ సినిమా టీజర్ ను కూడా విడుదల చేయనున్నారు. దీని కోసమే ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ చేసినట్లు సమాచారం. అయితే ఎన్టీఆర్ జీవిత చరిత్ర అంటే చివరిలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆయన్ని పదవి నుంచి తప్పించి అధికారాన్ని దక్కించుకున్న ఘటనలు ఉంటాయి. అయితే ఇది వివాదస్పద అంశం అయినందున కేవలం సినిమాల్లో నుంచి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి అధికారాన్ని దక్కించుకున్న ఘటనతోనే ఈ సినిమా ముగింపు ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. అయితే అక్కడ నుంచి జరిగిన సంఘటనలు రామ్ గోపాల్ వర్మ సినిమాలో చూసుకోవాలన్న మాట ప్రేక్షకులు.