రెచ్చిపోతున్న ‘పద్మావతి’ వ్యతిరేక శక్తులు

Update: 2017-11-19 14:01 GMT

దీపికా పడుకొనే ముక్కు కోస్తాం. సంజయ్ లీలా భన్సాలీ తల తెస్తే పది కోట్లు ఇస్తాం. ‘పద్మావతి’ సినిమా ప్రదర్శిస్తే థియేటర్లు తగలబెడతాం. ఇవి గత కొన్ని రోజులుగా పద్మావతి సినిమా వ్యతిరేక శక్తులు చేస్తున్న ప్రచారం. ఈ సినిమాలో చరిత్రను వక్రీకరించారని కొందరు..అలాంటిది ఏమీలేదని చిత్ర యూనిట్ వాదనలు. కానీ వివాదం మాత్రం ఎక్కడా ఆగటం లేదు. అయితే అంతిమంగా ఇది ఏ మలుపు తిరుగుతుందో అన్న టెన్షన్ చాలా మందిలో ఉంది. ఈ వివాదం కారణంగా సినిమా విడుదల కూడా వాయిదా పడింది. ప్రారంభం నుంచి ఈ సినిమాను వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. అయితే అవి  ఈ మధ్య పీక్ కు వెళ్ళాయని చెప్పొచ్చు. ఈ సినిమాకు వ్యతిరేకంగా రాజ్‌పుత్‌ వర్గీయులు ఆందోళన నిర్వహిస్తున్నారు. తాజాగా భన్సాలీ తలకు అఖిల భారతీయ క్షత్రియ మహాసభ వెలగట్టింది.

                                  భన్సాలీ తలను నరికి తెచ్చిస్తే రూ. 10 కోట్లు  ఇస్తామంటూ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్య చేసింది. అయినా సరే చిత్ర యూనిట్ మాత్రం ఎక్కడా భయపడకుండా తమ తప్పేమీలేదని చెబుతోంది.  పద్మావతి సినిమాలో  టైటిల్‌ రోల్‌ పోషించిన దీపికా పదుకోనే సినిమా వ్యతిరేక  ఆందోళనలపై మరోసారి స్పందించారు.  ‘పద్మావతి’ సినిమాను వివాదాస్పదం చేయడంపై ఆమె విస్మయం వ్యక్తం చేశారు. సినిమాలో ఎక్కడా అభ్యంతరకర సన్నివేశాల్లేవని ఆమె స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థపై తనకు నమ్మకముందని, కచ్చితంగా తమకు న్యాయం జరుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.

 

 

Similar News