మనకు ఏమి కావాలి అనుకున్నా వెంటనే ఆదుకునేది గూగుల్ తల్లే. ఏ సమాచారం అయినా చాలా వరకూ అందులో దొరుకుతుంది. దారి తెలియని దారి చూపటంతో పాటు ఎన్నో సేవలు అందిస్తోంది ఈ తల్లి. ఏ ఏరియాలో ట్రాఫిక్ రద్దీగా ఉందో ముందే హెచ్చరించి రద్దీ లేని దారి చూసుకోమని హెచ్చరిస్తుంది. అలాంటి గూగుల్ ఇప్పుడు ఓ కొత్త సేవను అందుబాటులోకి తెచ్చింది. అది చాలా మందికి ఉపయోగపడేదే. నగరాల్లోని పలు పాపులర్ హోటళ్ళలో లంచ్..డిన్నర్..బ్రేక్ ఫాస్ట్ చేయాలంటే గంటల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి ఉంటుంది. అది అన్ని చోట్లా కాదుకానీ..ఫేమస్ హోటళ్లలో ఈ తిప్పలు తప్పవు. చాలా చోట్ల సీట్ల కోసం భోజనం చేసేవారి వెనక నిలబడే పరిస్థితి కూడా ఉంటుంది.
అయితే గూగుల్ ను ఫాలో అయితే మీకు ఇక ఈ తిప్పలు ఉండకపోవచ్చు. ఎందుకంటే గూగుల్ కొత్తగా ప్రముఖ రెస్టారెంట్లలో వెయిటింగ్ సమయాన్ని చూపించనుంది. ఇది సెర్చ్ లోనూ మ్యాప్ లోనూ డిస్ ప్లే అవుతుందని పేర్కొంది. పాపులర్ టైమ్స్ విభాగంలో యూజర్లు ఈ వివరాలు తెలుసుకోవచ్చన్న మాట.అదే సమయంలో అత్యంత రద్దీగా ఉండే సమయాలను కూడా ఇది చూపించనుంది. క్యూలో ఎంత సేపు వేచిచూడాల్సి ఉంటుందో ఉజ్జాయింపుగా సమయం కూడా ఇది చెబుతుంది. హోటల్ కు వెళ్లి గంటలకు గంటలు ఎదురుచూసే బదులు ఎంచక్కా ఈ ఆప్షన్ ను వాడుకుంటే బెటర్ కదా.