Telugu Gateway
Top Stories

రఘురామకృష్ణంరాజు కేసు...సుప్రీంకోర్టు సంచలన ఆదేశం

రఘురామకృష్ణంరాజు కేసు...సుప్రీంకోర్టు సంచలన ఆదేశం
X

సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు జరిపించండి

తెలంగాణ హైకోర్టు నుంచి జ్యుడిషియల్ ఆఫీసర్ నియమించాలి

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వైద్య పరీక్షల వ్యవహారంలో కీలక మలుపు. సోమవారం నాడు సుప్రీంకోర్టులో రఘురామకృష్ణంరాజు బెయిల్ పిటీషన్ తోపాటు వైద్య పరీక్షల అంశంపై వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు కు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి లో వైద్య పరీక్షలు చేయించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి వినీత్ శరన్ నేతృత్వంలోని బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు న్యాయాధికారిని నియమించాలని..పరీక్షల సమయంలో రఘురామకృష్ణంరాజుతో న్యాయాధికారి ఉండాలని పేర్కొన్నారు. గాసుప్రీంకోర్టులో రఘురామకృష్ణంరాజు తరపున ముకుల్ రోహత్గీ, ఆదినారాయణ, ఏపీ ప్రభుత్వం తరపున దుష్వంత్ దవే, వి వి గిరి వాదనలు విన్పించారు. ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం అందించేందుకు అవకాశం కల్పించాలని..ప్రైవేట్ ఆస్పత్రిలో కూడా వైద్య పరీక్షలు అందించాలని కింది కోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోలేదని ముకుల్ రోహత్గీ కోర్టుకు నివేదించారు.

బెయిల్ రాకూడదనే ఉద్దేశంతోనే సెక్షన్ 124 (ఏ) పెట్టారని పేర్కొన్నారు. అసలు ఎవరి ఫిర్యాదు లేకుండా సీఐడీ అదనపు డీజీ విచారణ చేయటం..ఎఫ్ఐఆర్ నమోదు చేయటం జరిగిందన్నారు. ప్రభుత్వం తరపున వాదనలు విన్పించిన దుష్వంత్ దవే రమేష్ ఆస్పత్రి వైద్యులతో కాకుండా మంగళగిరి ఎయిమ్స్ వైద్యులతో పరీక్షలు చేయించటానికి అభ్యంతరం లేదన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి వినీత్ శరన్ స్పందిస్తూ ఏపీ, తెలంగాణల్లో ఆర్మీ ఆస్పత్రి ఉందా అని ప్రశ్నించారు. నిందితుడిని అరెస్ట్ చేసి తీసుకొచ్చిన హైదరాబాద్ లోని సికింద్రాబాద్ లో ఆర్మీ ఆస్పత్రి ఉందని..వైజాగ్ లో నేవల్ బేస్ ఆస్పత్రి ఉందని నిందితుడి తరపు లాయర్ ఆదినారాయణరావు కోర్టుకు తెలిపారు. కోర్టు ఫైనల్ గా సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించాలని ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ అంశాల్లోకి ఆర్మీ ఆస్పత్రిని లాగటం ఎందుకు అని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వ్యాఖ్యనించారు. అయితే ఇందులో రాజకీయం ఏమీలేదని..న్యాయాధికారిని నియమిస్తామని కోర్టు తెలిపింది. అయితే రఘురామకృష్ణంరాజు బెయిల్ పిటీషన్ ను శుక్రవారానికి వాయిదా వేశారు.

Next Story
Share it