లింగమనేనిని రక్షించింది ఎవరు?
స్టార్ హీరో...కాంట్రాక్టర్..సర్కారు కలిస్తే అక్రమాలు మాఫ్ అయినట్లేనా?!
ఎవరి వాటాలు వారికి దక్కాయా?
వందల ఎకరాల భూకబ్జా. వేల కోట్ల దోపిడీ. ఇదీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లింగమనేని రమేష్ కు చెందిన ఎల్ఈపీఎల్ పై వైసీపీ, సాక్షి పత్రికలు చేసిన తీవ్ర ఆరోపణలు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అంతా గప్ చుప్. ఏమి జరిగింది. ఎందుకు జరిగింది. అసలు ఆ సామాజిక వర్గం అంటేనే మండిపడే వైసీపీ చూస్తూ చూస్తూ వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడిన వ్యక్తిని అసలు ఏ మాత్రం టచ్ చేయకుండా ఎందుకు వదిలేసింది?. గత ప్రభుత్వంలో జరిగిన పలు లావాదేవీలకు సంబంధించి కేసుల మీద కేసులు పెడుతున్న వైసీపీ సర్కారు..ఇవిగో పక్కా ఆధారాలు అంటూ కూడా విషయాలు బహిర్గతం చేసి ఎందుకు లింగమనేని రమేష్ విషయంలో మౌనంగా ఉంది. అంటే దీని వెనక పెద్ద కథే నడిచిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఓ మెగా కాంట్రాక్టర్, ఓ స్టార్ హీరో ఎంటర్ అయ్యారని..వారిద్దరూ కలిసే సెటిల్ మెంట్ చేశారని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి.
అంతే కాదు..ఆ సంస్థకు చెందిన కీలక భూములు కొన్నింటిని ఆ మెగా కాంట్రాక్టర్ దక్కించుకున్నారని..అటు నుంచి ఎవరికి ఎంత చేరాలో అంత చేరిపోయాయని చెబుతున్నారు. ఆ స్టార్ హీరో కూడా ఆ మెగా కాంట్రాక్టర్ కు సంబంధించిన సేవలు రకరకాలుగా పొందుతుంటారు. అవసరం అయితే చాలు ఆ హీరోకు ప్రత్యేక విమానాలు కూడా వాలిపోతాయని టాక్ ఉంది. పైకి మాత్రం అందరూ అవినీతిని ఏ మాత్రం సహించేది లేదు అంటూనే అక్రమార్కులను కాపాడుతూ ఎవరి వాటాలు వారు పంచుకుంటున్నారు. మధ్యలో బలయ్యేది మాత్రం రైతులు..సామాన్యులు మాత్రమే. గతంలో లింగమనేని వల్ల రైతులకు అన్యాయం జరిగింది అంటూ గగ్గోలు పెట్టిన వైసీపీ ఇప్పుడు ఈ విషయంలో అసలు నోరెత్తటంలేదంటే ఏమి జరిగిందో ఊహించుకోవచ్చు అని ఓ అధికారి వ్యాఖ్యానించారు. అంతే కాదు..బయట మాత్రం రాజకీయ విషయాల్లో ప్రజల కోసం అలు పెరగని ఫైటింగ్ చేస్తున్నట్లు కలరింగ్..అవసరం వస్తే మాత్రం మధ్యవర్తులతో కలసి సెటల్ మెంట్లు చేస్తున్నారని సొంత పార్టీ నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు.