బిజెపికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ చావుడప్పు
అధికార టీఆర్ఎస్ కేంద్రం, బిజెపికి వ్యతిరేకంగా సోమవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ముఖ్యంగా ధాన్యం కొనుగోలులో కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి వ్యతిరేకంగా చావుడప్పు పేరుతో కార్యక్రమం నిర్వహించారు. పలు చోట్ల ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మలను సైతం దగ్దం చేశారు. అక్కడక్కడ బిజెపి శ్రేణులు దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా..ఉద్రిక్తతలు తలెత్తాయి. రాష్ట్ర మంత్రులు..ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని జిల్లాల్లోనూ ఈ కార్యక్రమాలు సాగాయి. మంత్రులు హరీష్ రావు, శ్రీనివాసగౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్ తదితరులు ఈ నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రైతు బాగుపడాలంటే బీజేపీ గద్దే దిగాల్సిందేనన్నారు. బీజేపీ రైతులకు దగా చేస్తోందని ఆరోపించారు.
వడ్లు కొనకుండా బీజేపీ రాజకీయ కుట్రలు చేస్తోందని, గ్రామ గ్రామాన బీజేపీ నేతలను నిలదీయాలని పిలుపునిచ్చారు. వడ్లు కొంటరా...కొనరా అని ప్రశ్నించాలని కోరారు. తెలంగాణకు బీజేపీ చేసిందేంటి ? అని ప్రశ్నించాలన్నారు. హరీష్ రావు గజ్వేల్ లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గం లో రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో 58 గ్రామాలలోనూ, మహబూబ్ నగర్ పట్టణ పరిధిలోని 49 వార్డులలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జెడ్పీ మైదానం నుండి వేలాదిమంది రైతులతో ర్యాలీగా బయలుదేరి కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక పోకడల పై చావు డప్పులు మ్రోగిస్తూ తెలంగాణ చౌరస్తా లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అన్ని చోట్లా ఇదే తరహా నిరసన ప్రదర్శనలు సాగాయి.