ధాన్యంపై తేల్చుకున్నాకే తెలంగాణకు
ధాన్యం సేకరణ అంశంపై కేంద్రంతో తాడేపేడో తేల్చుకునేందుకు ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ మంత్రులు మరికొన్ని రోజులు అక్కడే మకాం వేయనున్నారు. ఈ అంశంపై స్పష్టత తీసుకున్న తర్వాతే ఢిల్లీ నుంచి కదులుతామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. మంగళవారం నాడు కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ తో సమావేశం అయినా కూడా ఈ అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు. తెలంగాణ నుంచి ఎంత ధాన్యం సేకరిస్తారో లిఖితపూర్వక హామీ ఇవ్వాలని రాష్ట్ర మంత్రులు కోరారు. అయితే దీనిపై ఆయన ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అదే సమయంలో యాసంగిలో ఎట్టిపరిస్థితుల్లోనూ కేంద్రం బియ్యం కొనదని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తేల్చిచెప్పినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. పీయూష్ గోయల్‌తో తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీల సమావేశం ముగిసిన అనంతరం నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ధాన్యం సేకరణపై కేంద్రాన్ని స్పష్టత కోరామని నిరంజన్ రెడ్డి చెప్పారు. యాసంగిలో ధాన్యం కొనేది లేదని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. వానాకాలంలో 60 లక్షల టన్నులు కొనాలని లక్ష్యం నిర్దేశించారు. కేంద్రం నిర్దేశించిన లక్ష్యం 3 రోజుల్లో పూర్తి కానుంది.
రాష్ట్రంలో కొనాల్సిన ధాన్యం ఇంకా 10 నుంచి 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉంది. మరో 5 లక్షల ఎకరాల్లో వరి కోతలు జరుగుతున్నాయి. ఆ ధాన్యం జనవరి 15వ తేదీ వరకు అందుబాటులోకి వస్తుందన్నారు. మిగతా ధాన్యం సేకరించాలా? వద్దా? అని స్పష్టత కోరాం. కొనుగోలు కేంద్రాలు ఉంచాలా? మూసివేయాలా? అని అడిగాం. ధాన్యం సేకరణపై కేంద్రాన్ని లిఖితపూర్వక హామీ కోరాం. ఏ విషయమూ చెప్పేందుకు పీయూష్ గోయల్ రెండు రోజులు సమయం కోరారు. రెండు రోజుల తర్వాత పీయూష్ గోయల్‌ను కలుస్తాం. ఒకట్రెండు రోజులు ఇక్కడే ఉంటాం. ధాన్యం సేకరణపై తేల్చుకున్న తర్వాతనే తెలంగాణకు తిరిగి పయనమవుతాం అని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.మీ ఎఫ్‌సీఐ అధికారులు బియ్యం తరలించకపోతే అది మా తప్పు కాదని కేంద్రమంత్రికి వివరించాం. 30 నుంచి 40 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రతి రోజు లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉంది. నెలకు 10 లక్షల మెట్రిక్ టన్నుల దాకా మిల్లింగ్ చేసి ఇచ్చే సామర్థ్యం తెలంగాణకు ఉందని కేంద్రమంత్రికి చెప్పామని నిరంజన్ రెడ్డి తెలిపారు. బిజెపి నేతలు రాజకీయం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు.