Telugu Gateway
Telangana

బిజెపి జాతీయ వాదంలో తెలంగాణ ప్రయోజనాలు లేవా?

బిజెపి జాతీయ వాదంలో తెలంగాణ ప్రయోజనాలు లేవా?
X

తెలంగాణ మున్సిపల్, ఐటి శాఖల మంత్రి కెటీఆర్ మరోసారి బిజెపిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తాము మందు భారతీయులం అని..ఆ తర్వాతే తెలంగాణ బిడ్డలం అని వ్యాఖ్యానించారు. బిజెపి జాతీయ వాదంలో తెలంగాణ ప్రయోజనాలు లేవా? అని ప్రశ్నించారు. రాష్ట్రంపై వివక్ష చూపుతున్న పార్టీని ఎందుకు ఆదరించాలని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడ తప్పు జరిగినా తాము స్పందిస్తామన్నారు. కెటీఆర్ శుక్రవారం నాడు ఓ హోటల్ లో జరిగిన తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మరోసారి వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ అంశాన్ని లేవనెత్తారు. వైజాగ్ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమానికి మద్దతిస్తే ఆంధ్రప్రదేశ్‌ విషయాలు నీకెందుకని అంటున్నారు.. ఏపీ దేశంలో రాష్ట్రం కాదా అని ప్రశ్నించారు. ''విశాఖ ఉక్కును తుక్కు తుక్కు చేసి అమ్మేస్తున్నారు. ఇవాళ విశాఖ ఉక్కుపై పడ్డారు.

రేపు సింగరేణిని కూడా ప్రైవేట్‌పరం చేస్తామంటారు. ఏపీ విషయంలో నోరు మూసుకుని కూర్చోం. రేపు తెలంగాణకు కష్టం వస్తే మా వెంట ఎవరుంటారు. ఈ విషయాన్ని అందరూ ఆలోచించాలి'' అన్నారు. గ్యాస్ ధరల పెంపుపై అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పై సీఎంగా ఉన్న మోడీ విమర్శలు చేశారు. సిలిండర్ కు దండం పెట్టి ఓటేయాలని కోరారు. మరి ఇఫ్పుడు ఎవరికి మొక్కి ఓటు వేయాలని ప్రశ్నించారు. బిజెపికి ఓటు వేస్తే ధరల పెరుగుదలకు ఆమోదం తెలిపినట్లే అవుతుందని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ సర్కారు ఉద్యోగుల సంక్షేమం కోసం పాటుపడుతోందని తెలిపారు. అభివృద్ధిలోనూ దేశంలో ఇతర రాష్ట్రాల కంటే చాలా ముందు ఉందని తెలిపారు.

Next Story
Share it