Telugu Gateway
Politics

రఘురామకృష్ణంరాజు 'బిగ్ స్కెచ్'!

రఘురామకృష్ణంరాజు బిగ్ స్కెచ్!
X

అమ‌రావ‌తి ఏజెండా ఫిక్స్ వెన‌క క‌థ అదే

సీటు బిజెపిది..మ‌ద్ద‌తు టీడీపీ, జ‌న‌సేన‌ల‌ది

వైసీపీ స‌ర్కారుపై రాజుల గుర్రు

వైసీపీ రెబ‌ల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పెద్ద ప్లాన్ లోనే ఉన్నారు. ఆయ‌న అమ‌రావ‌తి ఏజెండాగా ఎన్నిక‌ల‌కు వెళ‌తాన‌ని ప్ర‌క‌టించ‌టం వెన‌క పెద్ద స్కెచ్ ఉంద‌ని ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం అయిన తెలుగుదేశం కంటే ఆయ‌న అధికార, సొంత పార్టీ వైసీపీపై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. తెలుగుదేశం నాయ‌కులు అయినా గ్యాప్ ఇస్తారు కానీ..విమ‌ర్శ‌లు చేయ‌టంలో ఆయ‌న ఏ మాత్రం గ్యాప్ ఇవ్వ‌టం లేదు. ఓ వైపు వైసీపీ కూడా ఆయ‌న‌పై అన‌ర్హ‌త వేటు వేయించేందుకు స‌న్నాహాలు చేస్తోంది. అయితే తాజాగా ఆయ‌న అన‌ర్హ‌త వేయించే అంశంపై సొంత పార్టీకి స‌వాల్ విసురుతున్నారు. చేత‌నైతే అన‌ర్హ‌త వేయి వేయించండి..లేదంటే నేనే రాజీనామా చేస్తా అని ప్ర‌క‌టిస్తూ వ‌స్తున్నారు. అంతే కాదు...రాజీనామా చేసి అమ‌రావ‌తి ఏజెండాతో ఎన్నిక‌ల‌కు వెళ‌తాన‌ని ప్ర‌క‌టిస్తున్నారు. అమ‌రావ‌తి అన్న‌ది తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబునాయుడి క‌ల‌ల రాజ‌ధాని అన్న సంగ‌తి తెలిసిందే. అమ‌రావ‌తి అంశంపై ఎన్నిక‌ల‌కు వెళ్ళ‌టానికి ఆయ‌న ఏమీ రాజ‌ధాని వ‌చ్చే గుంటూరు, క్రిష్ణా జిల్లాల‌కు చెందిన నాయ‌కుడు కూడా కాదు. కానీ ప‌క్క‌నే ఉండే ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని న‌ర‌సాపురం పార్ల‌మెంట్ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఎంపీ. మ‌రి ఆయ‌న గ‌త కొన్ని నెల‌లుగా చెబుతున్న‌ట్లు ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై కాకుండా..అమ‌రావ‌తిని ఏజెండాగా చేసుకోవ‌టంలోనే అస‌లు కిటుకు ఉంద‌ని చెబుతున్నారు.

రఘురామకృష్ణంరాజు తీసుకున్న అజెండా అమ‌రావ‌తి కాబ‌ట్టి తెలుగుదేశం పార్టీ ఈ కార‌ణంతో తాము ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ఇస్తామ‌ని చెబుతుంది. ఆయ‌న పోటీచేస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న బిజెపి కూడా అమ‌రావ‌తికి మ‌ద్ద‌తు ప‌లుకుతోంది. బిజెపితో భాగ‌స్వామిగా ఉన్న జ‌న‌సేన స‌హ‌జంగానే ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల్సి ఉంటుంది. అంతే త‌ప్ప‌..అక్క‌డ పోటీ పెట్టే ఛాన్స్ ఉండ‌దు. అంటే ఈ ఉప ఎన్నిక‌లో బిజెపి, టీడీపీ, జ‌న‌సేన‌లు ఒక వైపు. అధికార వైసీపీ ఒక వైపు నిల‌వాల్సి ఉంటుంది. దీంతోపాటు గ‌త కొన్ని రోజులుగా జ‌రుగుతున్న ప‌రిణామాల కార‌ణంగా రాజులు వైసీపీ స‌ర్కారుపై గుర్రుగా ఉన్నారు. రఘురామకృష్ణంరాజుతో ప్ర‌భుత్వం వ్య‌వ‌హరించిన అంశం కంటే మాజీ మంత్రి , టీడీపీ సీనియర్ నేత అశోక్ గ‌జ‌ప‌తిరాజు విష‌యంలో స‌ర్కారు వ్య‌వ‌హ‌రించిన తీరు విష‌యంలో ఆ సామాజికవ‌ర్గానికి చెందిన వారంతా తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న‌ట్లు ఆ సామాజిక వ‌ర్గ నేత‌లు చెబుతున్నారు.

రఘురామకృష్ణంరాజు రాజీనామా చేసి..ఉప ఎన్నిక అనివార్యం అయితే..బిజెపి, టీడీపీ, జ‌న‌సేన‌లు మూకుమ్మ‌డిగా ఆయ‌న అభ్య‌ర్ధిత్వానికి మ‌ద్ద‌తు ఇస్తే మాత్రం గెలుపు ఎవ‌రిది అవుతుంది అన్న‌ది ఇప్పుడే చెప్ప‌టం తొంద‌ర‌పాటు అవుతుంది కానీ..అధికార వైసీపీకి మాత్రం ఈ ఎన్నిక‌లో చుక్కలు క‌న్పించ‌టం ఖాయం అని రాజ‌కీయ వ‌ర్గాలు భావిస్తున్నాయి. ర‌హ‌దారులు, ఇసుక,, ఓటీఎస్ తో పాటు ప‌లు అంశాల్లో ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త నెలకొంది. మ‌రి ఇన్ని ప్ర‌తికూల అంశాల‌ను అధిగ‌మించి వైసీపీ విజ‌యం సాధించాల్సి ఉంటుంది. మూడు పార్టీల కాంబినేష‌న్ వ‌ర్క‌వుట్ అయి..ఉప ఎన్నిక‌లో వైసీపీ ప‌రాజ‌యం పాలైతే మాత్రం..అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు రెండేళ్ళ ముందు జ‌రిగే ఈ ఎన్నిక ప్ర‌భావం సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌పై ఉంటుంది. న‌ర‌సాపురంలో ఉప ఎన్నిక వ‌స్తే ఇక డ‌బ్బు ప్ర‌వాహం గురించి చెప్పాల్సిన ప‌నే ఉండ‌దు. మ‌రి ఈ న‌ర‌సాపురం ఉప ఎన్నిక ఏపీ రాజ‌కీయాల‌ను ఎన్ని మ‌లుపులు తిప్పుతుందో వేచిచూడాల్సిందే.

క్ష 'రెండు గుంటలు'

క్ష

Next Story
Share it