మెఘా ప్రాజెక్టుల అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి
కంపెనీ దగ్గర 70 వేల కోట్ల నల్లధనం ఉంది
కెసీఆర్ లా వైఎస్ ఒక్కరికే ప్రాజెక్టులివ్వలేదు..ఒక్కరి దగ్గరే కమిషన్లు తీసుకోలేదు
వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల సీఎం కెసీఆర్ పై, మెఘా క్రిష్ణారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఇప్పటి వరకూ రాష్ట్రంలో మెఘాకు ఇచ్చిన ప్రాజెక్టులు ఎన్నో బహిర్గతం చేయాలన్నారు. మెఘా సంస్థ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. షర్మిల సోమవారం నాడు మీడియాతో మాట్లాడుతూ మెఘా క్రిష్ణారెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 'తెలంగాణను దోచుకున్న వ్యక్తి మెఘా క్రిష్ణారెడ్డి. దీంతో దేశంలో సంపన్నుల జాబితాలో ఆయన పేరు చేరింది. అంత మేర దోచుకున్నాడు. మెఘా క్రిష్ణారెడ్డి అనే వ్యక్తి 70 వేల కోట్లు అవినీతి సొమ్ము..నల్లధనం ఆయన దగ్గర ఉందని..దానికి సంబంధించి 12 వేల కోట్ల రూపాయల జీఎస్టీ మెఘా క్రిష్ణారెడ్డి డిపార్ట్ మెంట్ కు కట్టాల్సి ఉంటుందని..స్వయంగా జీఎస్టీ ఇంటెలిజెన్స్ డైరక్టర్ స్పష్టం చేశారు. మరి అలాంటప్పుడు ..అలాంటి మనిషి మీద ఎలాంటి ఎంక్వైరీలు లేకుండా అన్ని ప్రాజెక్టులు ఆయన చేతుల్లోనే ఎందుకు పెడుతున్నారు. కనీసం విచారణ అయినా చేస్తున్నారా..మీకు మీకు ఒప్పందం లేకపోతే అన్ని ప్రాజెక్టులు మెఘా క్రిష్ణారెడ్డికే ఎందుకు ఇస్తున్నారు. మెఘా క్రిష్ణారెడ్డికే ఇవ్వాల్సిన అవసరం ఏముంది?. మీరు నేరంలో భాగస్వాములు కాకపోతే ఎందుకు మెఘా క్రిష్ణారెడ్డికి ఇస్తున్నారు.
రాజశేఖరరెడ్డి కెసీఆర్ లాగా ఒక్క మనిషికే అన్ని ప్రాజెక్టులు ఇవ్వలేదు..ఒక్క మనిషి దగ్గరే అన్ని కమిషన్లు తీసుకోలేదు.' అని వ్యాఖ్యానించారు. రాజశేఖరరెడ్డి అందరి మనిషి అని..కెసీఆఆర్ లాగా ఒక్కరికే పనులు ఇవ్వలేదన్నారు. పక్క రాష్ట్ర సీఎంను ఇంటికి పిలిచి స్వీట్లు తినిపించినప్పుడు.. పోలవరం వల్ల ఇబ్బంది అవుతుందని సీఎం కేసీఆర్ఎందుకు అనలేదు? అన్నారు. కాళేశ్వరం లోపాల బాధ్యత ఎవరు తీసుకుంటారని నిలదీశారు. కలర్ ఫోటోలకు, టూరిజం స్పాట్‌గా మాత్రమే కాళేశ్వరం పనికొచ్చిందని షర్మిల ఎద్దేవాచేశారు. కడెం ప్రాజెక్ట్ గేట్లు మార్చాలన్న డిమాండ్లను సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ప్రాజెక్టు గేట్లు పనిచేయకపోవడం వల్లే ఇంత పెద్ద వరద వచ్చిందని తెలిపారు. 33 మంది సిబ్బంది ఉండాల్సిన కడెం ప్రాజెక్టు దగ్గర ముగ్గురే ఉన్నారని తెలిపారు. బాధితుల డిమాండ్ మేరకు కరకట్ట నిర్మించాలన్నారు. వరదల్లో గూడు కోల్పోయినవారికి డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లు కట్టివ్వాలని షర్మిల డిమాండ్ చేశారు.