మహరాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చాలని బెదిరిస్తున్నారు
శివసేన రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ సంచలన లేఖ లేఖ విడుదల చేశారు. ఈ లేఖను ఆయన రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడికి పంపారు. దీన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సహాయం చేయమని కొంతమంది వ్యక్తులు తనను సంప్రదించారని, తద్వారా మధ్యంతర ఎన్నికలు నిర్వహించుకోవాలని వ్యూహం పన్నారని సంజయ్ రౌత్ ఆరోపించారు. తాను వారి సంప్రదింపులను తిరస్కరించినందున తనను బెదిరిస్తున్నారని ఎంపీ తన లేఖలో పేర్కొన్నారు. తాను ఎవరికీ భయపడనని..నిజాన్ని నిర్భయంగా బయటపెడతానన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు బిజెపి కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఉపయోగిస్తోందని పేర్కొన్నారు. తనతోపాటు మహారాష్ట్ర కేబినెట్ లోని ఇద్దరు మంత్రులను కూడా వాళ్లు బెదిరించారని..లేకపోతే ఈడీ కేసులు పెడతామని.జైలుకు పంపిస్తామని హెచ్చరించారని ఆరోపించారు.
పదహేడు సంవత్సరాల క్రితం అలీబాగ్ లో తమ కుటుంబం కొనుగోలు చేసిన ఒక ఎకరం భూమికి సంబంధించి ఇప్పుడు కొత్త వివాదం రేపే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. అమ్మిన వారిని కూడా తనకు వ్యతిరేకంగా ప్రకటన చేయాల్సిందిగా కోరుతున్నారని ఆరోపించారు. గత ఏడాది జరిగిన తన కుమార్తె వివాహనికి సంబంధించి కూడా ఈవెంట్ మేనేజర్లను 50 లక్షల రూపాయల నగదు చెల్లింపులు చేసినట్లు చెప్పాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నట్లు తన లేఖలో పేర్కొన్నారు. ఇదే అంశంపై ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ లేఖ కేవలం ట్రైలర్ మాత్రమే అని..బిజెపి క్రిమినల్ సిండికేట్ ను కొంత మంది ఈడీ అధికారులు ఎలా నడిపిస్తున్నారో త్వరలోనే బయట పెడతానని హెచ్చరించారు.