Telugu Gateway
Politics

మోడీ..జోగిన‌ప‌ల్లి సంతోష్ ల‌ భేటీ ర‌హ‌స్య‌మేంటి?

మోడీ..జోగిన‌ప‌ల్లి సంతోష్ ల‌ భేటీ ర‌హ‌స్య‌మేంటి?
X

కెసీఆర్ మోడీకి గులాంగిరీ చేస్తున్నారు

ఆర్ధిక నేరాల నుంచి ర‌క్షణ‌కే మోడీకి స‌రెండర్

టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ఎంపీల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పార్ల‌మెంట్ స‌మావేశాలు ప్రారంభం అయిన రోజే రాజ్య‌స‌భ స‌భ్యుడు జోగిన‌ప‌ల్లి సంతోష్ తోపాటు మ‌రికొంత మంది ఎంపీలు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీతో స‌మావేశం అయ్యార‌ని తెలిపారు. త‌ర్వాత ఎంపీల‌ను బ‌య‌ట‌కు పంపి సంతోష్ ఒక్క‌రే ప్ర‌ధానితో ఏమి మాట్లాడారో బ‌హిర్గ‌తం చేయాల‌ని డిమాండ్ చేశారు. రాష్ట్ర స‌మ‌స్య‌లు, ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే ప‌నుల గురించి మాట్లాడితే ఎంందుకు ఆ విష‌యాలు క‌నీసం వాళ్ల సొంత ప‌త్రిక న‌మ‌స్తే తెలంగాణ‌లో కూడా రాలేద‌న్నారు. ఎందుకు ఈ భేటీని ఈ ర‌హ‌స్యంగా ఉంచార‌ని రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. ప్ర‌ధానితో టీఆర్ఎస్ ఎంపీలు ఏమి మాట్లాడారో..అందులో ఉన్న ర‌హ‌స్యాలు ఏమి ఉన్నాయో తేలాల‌న్నారు. ముఖ్య‌మంత్రి కెసీఆర్ వ్య‌వ‌హ‌రాలు చూసే అమ‌రేంద‌ర్ రావుకు ఈ భేటీ ఫోటోలు కూడా వెళ్ళాయ‌ని..మ‌రి వాటిని ఎందుకు బ‌హిర్గ‌తం చేయ‌లేద‌ని రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. ఎన్నిక‌లు వ‌చ్చిన ప్ర‌తిసారి కేంద్రంపై పోరాడ‌తా..ఢిల్లీని వ‌ణికిస్తా అని చెప్పే కెసీఆర్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నార‌ని ప్ర‌శ్నించారు. సీఎం కెసీఆర్ పూర్తిగా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీకి అండ‌గా నిల‌బ‌డుతున్నార‌ని ఆరోపించారు. అంతే కాదు మోడీకి కెసీఆర్ గులాంగిరి చేస్తున్నారు..మోడీ ద‌గ్గ‌ర లొంగిపోయాడ‌న్నారు. దీని వ‌ల్ల తెలంగాణ తీవ్ర అన్యాయం జ‌రుగుతోంద‌ని తెలిపారు. రేవంత్ మంగ‌ళ‌వారం నాడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

వాళ్లు చేసిన ఆర్ధిక నేరాల నుంచి కాపాడుకునేందుకే ఇలా చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. మంగ‌ళ‌వారం నాడు ఢిల్లీలో జ‌రిగిన 14 విప‌క్ష పార్టీల స‌మావేశానికి టీఆర్ఎస్ ఎందుకు హాజ‌రు కాలేద‌ని ప్ర‌శ్నించారు. పోనీ త‌మ‌తో క‌ల‌వ‌టంపై ఏమైనా అభ్యంత‌రాలు ఉంటే సొంతంగా అయినా స‌భ‌లో ప్ర‌జ‌ల‌కు సంబంధించిన ఏ ఒక్క అంశం పై కూడా స్పందించ‌లేద‌న్నారు. దీంతోనే టీఆర్ఎస్ ప్ర‌జ‌ల ప‌క్క‌న కాదు..మోడీ ప‌క్క‌నే ఉన్నార‌నే విష‌యం తేలిపోయింద‌ని వ్యాఖ్యానించారు. మోడీ పంచ‌న చేరి సీఎం కెసీఆర్ తెలంగాణ‌ను నిండా ముంచుతున్నార‌ని, పార్ల‌మెంట్ ప్రారంభం రోజు టీఆర్ఎస్ ఎంపీలు ప్ర‌ధానితో ఏమి మాట్లాడారోచెప్పాల‌న్నారు. ఎందుకు ఈ విష‌యాన్ని ర‌హ‌స్యంగా పెట్టారో ప్ర‌జ‌ల‌కు తెలియాల్సిన అవ‌సరం ఉంద‌న్నారు. అవినీతి చిట్టా మోడీ ద‌గ్గ‌ర ఉంది అని ఆయ‌న కాళ్ళు ప‌ట్టుకున్నారా? అని ప్ర‌శ్నించారు. ఇది నిజం కాక‌పోతే కాద‌ని ఖండించండి తాము వివ‌రాలు బ‌య‌ట‌పెడ‌తామ‌ని తెలిపారు. మీడియాతో ఈ ర‌హ‌స్య భేటీపై పీఎంవో నుంచి స‌మాచారం తెలుసుకోవ‌చ్చ‌న్నారు. బిజెపి, టీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్క‌టే అని..బండి సంజ‌య్ పాద‌యాత్ర ఆగ‌టానికి కూడా కార‌ణం అదే అన్నారు.

Next Story
Share it