పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాటలు విని ఇష్టానుసారం వ్యవహరించే అధికారులను బ్లాక్ లిస్ట్ లో పెడతామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. ఏకగ్రీవాలకు సంబంధించి ధృవపత్రాలు ఇవ్వకపోతే చర్యలు తప్పవన్నారు. ఆయన శుక్రవారం నాడు తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎస్‌ఈసీ జిల్లాలన్నీ తిరిగి అధికారులను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై చర్యలు తీసుకోకుండా మేనిఫెస్టో రద్దు చేశారని తప్పుబట్టారు. ఏకగ్రీవాలు చట్ట విరుద్ధమని ఏ చట్టంలో ఉందని మంత్రి ప్రశ్నించారు. ఓటు నమోదు చేసుకోవడం తెలియని వ్యక్తి ఎస్‌ఈసీగా ఉన్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవాచేశారు. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఏకగ్రీవాలను వెంటనే ప్రకటించవద్దంటూ కలెక్టర్లకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవరకు ఫలితాలను నిలిపి ఉంచాలని పేర్కొంది. తమకు వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించిన తర్వాతే ఫలితాలు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అలాగే ఎన్నికలపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి నివేదిక పంపాలని చిత్తూరు, గుంటూరు కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. లోపాలు ఉన్నట్లు తేలితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని ఎస్‌ఈసీ హెచ్చరించింది. ఈ వ్యవహారంపై అధికార వైసీపీ తీవ్రంగా స్పందించింది. ఏకగ్రీవాలపై రమేష్ కుమార్ కు ఎందుకంత ఉలిక్కిపడుతున్నారని పార్టీ నేతలు మండిపడ్డారు. పదవి విరమణ చేసిన తర్వాత పదవి కోసమే చంద్రబాబుతో రమేష్ కుమార్ లాలూచీపడుతున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు.