త్వరలోనే రోడ్ల మీదకు వస్తా..దేనికైనా తెగిస్తా
తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రస్తుతం రాక్షసపాలన సాగుతోందని ధ్వజమెత్తారు. ప్రజల కోసం తాను త్వరలోనే రోడ్లపైకి వస్తానన్నారు. ఇప్పుడు వైసీపీ చేస్తున్న దానికి వందరెట్లు చూపిద్దాం అంటూ పార్టీ నేతలతో వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లా నాయకులతో ఆదివారం ఫోన్‌లో మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల ప్రచారాన్ని ఫోన్‌లో నిర్వహించిన ఆయన.. కావలి మండలం రుద్రకోటలో టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఫోన్‌తో కార్యకర్తలు, అభిమానులతో మాట్లాడారు. ఉత్తర భారతదేశ రాష్ట్రాలలో ఇలాంటి పాలన చూశామన్నారు.
కార్యకర్తలు, అభిమానులతో తనది జన్మజన్మల అనుబంధమని, ఎవరికి ఇబ్బంది వచ్చినా సహించనన్నారు. సినిమా షూటింగ్ పూర్తయ్యాక రోడ్లమీదకి వస్తానని, ప్రజలందర్నీ కలుసుకుంటానన్నారు. గత కొంత కాలంగా ఆయన పార్టీ నిర్వహించే అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. పొలిట్ బ్యూరో పదవిపై అసంతృప్తితో ఉన్న బాలకృష్ణ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోరుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అందులో భాగాంగానే ఆయన నేరుగా పలు జిల్లాల నేతలతో మాట్లాడుతూ వస్తున్నారు.