Telugu Gateway

ఇది మోడీ ఐడియానా..అమిత్ షా సలహానా?

ఇది మోడీ ఐడియానా..అమిత్ షా సలహానా?
X

పశ్చిమ బెంగాల్ లో ఎనిమిది విడతల్లో ఎన్నికలు నిర్వహించేలా సీఈసీ సునీల్ అరోరా విడుదల చేసిన షెడ్యూల్ పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. ఇది ప్రధాని మోడీ ఐడియానా? లేక అమిత్ షా సలహానా అని ఎద్దేవా చేశారు. ''బీజేపీ వర్గాల నుంచి నాకు సమాచారం అందింది. వారి సలహాలకు అనుగుణంగానే ఈ తేదీలు ఖరారు చేసినట్లు కనిపిస్తోంది. ఒక రోజు ఓ జిల్లాలోని సగం నియోజకవర్గాలకే ఎన్నికలు నిర్వహిస్తారా? అసోంలో ప్రచారం ముగిసిన అనంతరం తాపీగా బెంగాల్‌లో ప్రచారం చేసుకునేందుకే ఈ ఎత్తుగడ వేశారా? ఈ సారి ఆటలో మిమ్మల్ని మరోసారి చిత్తుగా ఓడిస్తాను. దెబ్బకు దెయ్యం వదిలిస్తాను. నేను బెంగాల్‌ పుత్రికను. బీజేపీ కంటే నాకే ఈ రాష్ట్రం గురించి ఎక్కువగా తెలుసు. ఎనిమిది విడతలు అయినా గెలుపు మాదే. మీ కుట్రలన్నీ ఛేదిస్తాను.' అని వ్యాఖ్యానించారు.

మీరు చేసిన అవమానానికి బెంగాల్‌ ప్రజలు కచ్చితంగా బదులు తీర్చుకుంటారు. దేశంలో ఉన్న ఒకే ఒక్క మహిళా ముఖ్యమంత్రి మీద మీ కక్షసాధింపు చర్యలు అందరూ గమనిస్తున్నారు అంటూ బీజేపీ నాయకత్వంపై మండిపడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో(2016) 294 స్థానాలకు గానూ టీఎంసీ 211, వామపక్షాలు 79 గెలుచుకోగా బీజేపీ కేవలం 3 స్థానాల్లోనే గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ 18 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుని మమతకు షాకిచ్చింది. అయితే సీఈసీ సునీల్ అరోరా ఎనిమిది దశల షెడ్యూల్ ను సమర్ధించుకున్నారు. గత ఎన్నికలు ఏడు దశల్లో జరిగాయని..ఇప్పుడు ఎనిమది దశలు అయితే పెద్దగా మార్పేమి ఉంటుందని ప్రశ్నించారు. అక్కడి శాంతి భద్రతల పరిస్థితిని బట్టే నిర్ణయం తీసుకున్నామని వ్యాఖ్యానించారు.

Next Story
Share it