Telugu Gateway
Politics

సీఎస్ ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తారా?

సీఎస్ ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తారా?
X

మల్లు భట్టివిక్రమార్క ఆగ్రహం

రాష్ట్రంలో కరోనాతో ప్రజలు పెద్ద ఎత్తున చనిపోతుంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పరిస్థితులు అదుపులో ఉన్నాయని చెప్పటం దారుణం అని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. బాధ్యత గల సీఎస్ స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా అబద్ధాలు ఆడటం సరికాదన్నారు. తానే ఒక ఇంజక్షన్ కోసం చాలా మందికి ఫోన్ చేసి అడగాల్సి వచ్చిందని..అయినా కూడా ఎక్కడా దొరకలేదన్నారు. తనకే ఇలాంటి పరిస్థితి ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కరోనా నియంత్రణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతుందని మండిపడ్డారు. యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సింది పోయి.. అర్ధాంతరంగా ఆరోగ్య మంత్రిని తీసేశారని మండిపడ్డారు. మల్లు భట్టివిక్రమార్క బుధవారం నాడు మీడియాతో మాట్లాడారు. 'రాష్ట్రంలో టెస్టులు లేవు.. కరోనా వ్యాక్సిన్ లేదు. తెలంగాణ రాష్ట్రానికి దౌర్భాగ్య పరిస్థితి పట్టింది. సీఎం దగ్గర శాఖ పెట్టుకుని ఏం సమీక్ష చేశారు?. సభలో కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చుతా అని మాటిచ్చి మరిచిపోయారు. ఏడాది కిందట సీఎం వేసిన టాస్క్‌ ఫోర్స్ ఉందా..? పని చేస్తుందో ఎవరికి తెలియదు. టాస్క్‌ ఫోర్స్ ప్రతిపక్షాలకు కూడా నివేదిక ఇస్తుంది అని సీఎం చెప్పారు.

ఇప్పటివరకు మాకైతే నివేదిక ఇవ్వలేదు.' అని తెలిపారు. సీఎం కేసీఆర్‌ ముందు నువ్వు బయటకు రా... ప్రజల పరిస్థితి అర్దం చేసుకో అని సూచించారు. చీఫ్ సెక్రెట‌రీ అన్నీ బాగున్నాయ‌ని అంటున్నారని, ఆయన వస్తే ఆసుపత్రులకు తీసుకెళతామని సవాల్‌ విసిరారు. జనం సొమ్ముతో జీతాలు తీసుకునే మీరు... ప్రజలు సేవ చేయకుండా ఏం చేస్తున్నారని భట్టి విక్రమార్క నిలదీశారు. ప్రభుత్వానికి తాము సహకరించడానికి సిద్ధమని ప్రకటించారు. గవర్నర్ అపాయింట్‌మెంట్‌ అడిగామని చెప్పారు. వెంటిలేటర్లు ఉన్న చోట టెక్నీషియన్లు లేరు అని ఆరోపించారు. ఏడాది కిందటే ఉద్యోగుల భర్తీ చేయండి అని చెప్పినట్లు గుర్తుచేశారు. ప్రైవేట్ ఆసుపత్రులకు ఫీజులు ఫైనల్ చేయండి అని విజ్ఞప్తి చేశారు. జలగల్లా రక్తం పీల్చుకు తాగుతున్నాయని, వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Next Story
Share it