కేంద్రంతో యుద్ధం చేస్తామన్నారుగా
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం నాడు అధికార, విపక్షాల మధ్య హాట్ హాట్ చర్చ జరిగింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సర్కారు తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో ప్రగతి ఎక్కడుందో కనిపించడంలేదని విమర్శించారు. మద్యం అమ్మకాలు, అప్పులు తెచ్చుకోవడంలో తప్ప మిగతా అన్నింట్లో తిరోగమనమేనన్నారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న రైతుల ఆందోళనపై చర్చిద్దామని కోరారు. అయితే దీనికి సీఎం కెసీఆర్ అడ్డుపడుతూ కేంద్రం చేసిన చట్టాలపై అసెంబ్లీలో ఓ పరిమితి మేరకు మాత్రమే మాట్లాడగలమని వ్యాఖ్యానించారు. వ్యవసాయ చట్టాలపై ఇప్పటికే రాష్ట్రం తన అభిప్రాయం చెప్పిందని సీఎం కెసీఆర్ వ్యాఖ్యానించారు. సీఎం వ్యాఖ్యలపై స్పందించిన భట్టి విక్రమార్క గతంలో చాలాసార్లు కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలపై అసెంబ్లీలో చర్చించి..తీర్మానాలు చేసిన సందర్భాలు ఉన్నాయన్నారు. అవసరం అయితే కేంద్రంతో యుద్ధం చేస్తామని కూడా సీఎం కెసీఆర్ ప్రకటించిన విషయాన్ని భట్టి విక్రమార్క గుర్తుచేశారు. పంజాబ్, కేరళ రాష్ట్రాల తరహాలో తెలంగాణలోనూ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి పంపుతామని ప్రతిపాదించారు. దీంతోపాటు ఐటిఐఆర్ ప్రాజెక్టు సాధనకు ఉమ్మడిగా పోరాటం చేద్దామని వ్యాఖ్యానించారు.
అయితే భట్టి విమర్శలకు సీఎం కేసీఆర్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. భట్టి విక్రమార్క వాఖ్యలు సరైనవి కావన్నారు. ఆ వాఖ్యలను విత్ డ్రా చేసుకోవాలని సూచించారు. భట్టి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను కోరారు. దీంతో సభాపతి భట్టి వాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు. అనంతరం ప్రజా సమస్యలపై మాట్లాడకుండా గొంతు నొక్కేస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. సీఎం కెసీఆర్, మంత్రులు సభను పదే పదే తప్పుదారి పట్టిస్తున్నారని అసెంబ్లీ వెలుపల మీడియాతో మాట్లాడుతూ విమర్శించారు. చేయని తప్పుకు పదే పదే క్షమాపణలు చెప్పాలని కోరటం ఏమిటని ప్రశ్నించారు. సీఎం, మంత్రులు అహంకారతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సభ నడుస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి ప్రమాదంగా మారిందన్నారు.