వ్యాక్సినేషన్ పై కేంద్రానికి ముందు చూపులేదు
కేంద్రం తీరుపై తెలంగాణ మంత్రి కెటీఆర్ మరోసారి మండిపడ్డారు. కరోనా వ్యాక్సినేషన్ విషయంలో ఏ మాత్రం ముందు చూపులేకుండా వ్యవహిరించిందని మండిపడ్డారు. ఇతర దేశాలకు వ్యాక్సిన్లు ఏగుమతి చేయకుండా ఉండి ఉంటే.ఇప్పుడు మన ప్రజలకు వ్యాక్సిన్లు అందేవని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోనే వ్యాక్సిన్ తయారు అవుతున్నా మన ప్రజలకు ఇది ఏ మాత్రం అందుబాటులో లేకుండా పోయిందని విమర్శించారు. ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లలో 85 శాతం మొత్తాన్ని కేంద్రం తన ఆధీనంలో ఉంచుకుందని..మిగిలిన 15 శాతం మాత్రమే రాష్ట్రాలు..ప్రైవేట్ ఆస్పత్రులకు కేటాయించారన్నారు.
వ్యాక్సిన్ తయారీ సంస్థలు కూడా లాభాల కోసం ఆ పదిహేను శాతంలోనూ ఎక్కువ మొత్తాలను ప్రైవేట్ ఆస్పత్రులకు ఇస్తున్నారని తెలిపారు. మంత్రి కెటీఆర్ శుక్రవారం నాడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తిప్పాపూర్ లో వంద పడకల ఆస్పత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పడుతోందని తెలిపారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని..అన్ని రకాల మందులు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో రెండుసార్లు ఇంటింటి సర్వే చేశామన్నారు. కరోనాకు శాశ్వత పరిష్కారం ఒక్క వ్యాక్సినేషన్ మాత్రమే అని తెలిపారు.