Telugu Gateway
Politics

కాంగ్రెస్ కు కౌషిక్ రాజీనామా..రేవంత్ పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

కాంగ్రెస్ కు కౌషిక్ రాజీనామా..రేవంత్ పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు
X

కాంగ్రెస్ లో రాజ‌కీయ ర‌గ‌డ కొన‌సాగుతూనే ఉంది. తొలుత కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ఏమి ఆరోప‌ణ‌లు చేశారో ఇప్పుడు..హుజూరాబాద్ కాంగ్రెస్ నేత కౌషిక్ రెడ్డి కూడా అవే ఆరోప‌ణ‌లు చేశారు. దీంతో కాంగ్రెస్ లో మ‌రో సారి క‌ల‌క‌లం. అదే స‌మ‌యంలో హుజూరాబాద్‌ నేత‌ కౌషిక్‌రెడ్డి సోమవారం పార్టీకి రాజీనామా చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు. టీపీసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్‌ నోటీసు అందుకున్న 24 గంటల్లోనే కౌశిక్‌ రెడ్డి రాజీనామా ప్రకటించడం విశేషం. రాజీనామా ప్రకటన అనంతరం కౌషిక్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు..'50 కోట్ల రూపాయలు ఇచ్చి రేవంత్‌ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్‌ అయ్యారు. సీనియర్లను కాదని రేవంత్‌ రెడ్డికి టీపీసీసీ బాధ్యతలు అప్పగించడం నన్ను బాధించింది. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ మనుగడ కష్టం'' అన్నారు. పీసీసీ ప్రెసిడెంట్ గా ఉండి రేవంత్ రెడ్డి హుజూరాబాద్ లో కాంగ్రెస్ గెల‌వ‌దు అని చెప్ప‌టం త‌న‌ను బాధించింద‌ని తెలిపారు. త‌న రాజీనామాకు, మాజీ పీసీసీ ప్రెసిడెంట్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేద‌న్నారు. ఎంతో బాధ‌తోనే తాను రాజీనామా చేస్తున్న‌ట్లు వ్యాఖ్యానించారు.

ఈటెల రాజేంద‌ర్ కు రేవంతే అమ్ముడుపోయారంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆరు నెల‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుంద‌ని అన్నారు. హుజూరాబాద్ లో చేతనైతే డిపాజిట్లు తెచ్చుకోవాల‌ని స‌వాల్ విసిరారు. కొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ, టీఆర్‌ఎస్‌ నాయకులతో సన్నిహితంగా ఉంటున్నట్లు ఫిర్యాదులు నేపథ్యంలో 24 గంటల్లో వివరణ ఇవ్వాలంటూ క్రమశిక్షణ సంఘం కౌశిక్‌రెడ్డికి ఇచ్చిన నోటీస్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. గతంలో కౌషిక్‌రెడ్డిని హెచ్చరించినా ఆయన తీరులో మార్పు రాలేదని క్రమశిక్షణ సంఘం తెలిపింది. ఈటల రాజీనామాతో ఉప ఎన్నిక తథ్యమైన హుజూరాబాద్‌లో.. టీఆర్‌ఎస్‌ తనకే టికెట్‌ ఇస్తుందని ఫోన్‌లో కౌశిక్‌ రెడ్డి స్థానిక నాయకులతో చెప్తున్నట్లు ఉన్న ఆడియో క్లిప్‌ వైరలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీపీసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. ఆ త‌ర్వాత సాయంత్రానికి స‌స్పెండ్ చేసిన‌ట్లు ప్ర‌క‌టించింది.

Next Story
Share it