Telugu Gateway
Politics

ఇది జగన్..వైసీపీ ఎంపీల ఫెయిల్యూర్

ఇది జగన్..వైసీపీ ఎంపీల ఫెయిల్యూర్
X

కేంద్ర బడ్జెట్ పై తెలుగుదేశం సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు స్పందించారు. సీఎం జగన్, వైసీపీ ఎంపీలు రాష్ట్రాన్ని పూర్తిగా విస్మరించి సొంత ప్రయోజనాల కోసమే కేంద్ర మంత్రులతో, ప్రధానితో భేటిలు తప్ప రాష్ట్రానికి నిధులు రాబట్టడం కోసం కాదని విమర్శించారు. ఎంతసేపూ తన కేసుల మాఫీ యావే తప్ప కేంద్ర బడ్జెట్ లో నిధులు తెద్దామన్న ఆలోచన సిఎం జగన్మోహన్ రెడ్డికి లేదన్నారు. 25మంది ఎంపిలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామని చెప్పి, ఇప్పుడు కనీసం ఆ దిశగా ప్రయత్నం లేదన్నారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్ ను చిన్నచూపు చూస్తోందనేది ఈ బడ్జెట్ లో కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలకు ఈ బడ్జెట్ లో న్యాయం జరగలేదు. పేదరికం పెరుగుతోంది, ఆర్ధిక అసమానతలు పెరుగుతున్నాయి, వాటిని తగ్గించడంపై, తొలగించడంపై దృష్టి పెట్టలేదు. సామాజిక న్యాయం అనేది కొరవడుతోంది అనేది చాలా స్పష్టం. అసమానతల తొలగింపుపై దృష్టి పెట్టకపోతే అసంతృప్తి పెరుగుతుందన్నారు. దేశంలో ప్రస్తుతం జరుగుతోన్న ఆందోళనల్లో రైతుల డిమాండ్లను ఈ బడ్జెట్ లో ప్రస్తావించలేదు. రైతులకు, పేదలకు, ఆంధ్రప్రదేశ్ కు ఈ బడ్జెట్ ఆశాజనకంగా లేదన్నారు. ఏపి ఆర్ధిక పరిస్థితి బలోపేతానికి కేంద్రం నుంచి సరైన ప్యాకేజి ఈ బడ్జెట్ లో కూడా అందక పోవడం బాధాకరం. ఏపీలో ఉన్న సమస్యల పరిష్కారంపై కేంద్రం నుంచి ఏవిధమైన సహకారం అందేవిధంగా కనిపించడం లేదు.

రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి కూడా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఏపి పునర్విభజన చట్టంలో అంశాలు, ప్రత్యేక హోదా, వెనుకబడిన 7 జిల్లాల అభివృద్దికి నిధులు, రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్ధిక సమస్యల పరిష్కారాలపై ఈ బడ్జెట్ లో ప్రస్తావన లేదని విమర్శించారు. ''ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయని'' జగన్ రెడ్డి ఎన్నికల ముందు ప్రజల్లో ఆశలు కల్పించారు. పదవిలోకి వచ్చాక ప్రత్యేక హోదా రాబట్టడం గురించి గాని, పెట్టుబడులు రాబట్టడంపైగాని ఆయన దృష్టి లేదు. 151 మంది ఎమ్మెల్యేలు ఉండికూడా రాష్రాటిన్ని విచ్ఛిన్నం చేయడమే లక్యంగా పెట్టుకున్నారు తప్ప, అంతర్గత వనరులు పెంచి, కేంద్రం నిధులు రాబట్టి రాష్రాన్ని అభివృద్ది చేయాలన్న తలంపు లేకపోవడం బాధాకరమన్నారు.

Next Story
Share it