Telugu Gateway
Politics

బిజెపి కుట్ర‌లో భాగ‌మే ప్ర‌వీణ్ కుమార్ ఎంట్రీ

బిజెపి కుట్ర‌లో భాగ‌మే ప్ర‌వీణ్ కుమార్ ఎంట్రీ
X

అధికార టీఆర్ఎస్ మాజీ ఐపీఎస్ ప్ర‌వీణ్ కుమార్ చేసిన విమ‌ర్శ‌ల‌పై ఎదురుదాడి ప్రారంభించింది. బిజెపి కుట్ర‌లో భాగంగానే ఆయ‌న తెర‌పైకి వ‌చ్చార‌ని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గ్యాద‌రి కిషోర్ ఆరోపించారు. ద‌ళితుల‌కు ఎన్నో చేస్తున్న సీఎం కెసీఆర్ పై విమ‌ర్శ‌లు చేసిన ప్ర‌వీణ్ కుమార్..కేంద్రంలో ఏమీ చేయ‌ని బిజెపిపై ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడ‌లేద‌ని ప్ర‌శ్నించారు. ఉద్యోగం పోతుంద‌నే భ‌యంతోనే ప్ర‌వీణ్ కుమార్ వీఆర్ఎస్ తీసుకున్నార‌ని విమ‌ర్శించారు. సీఎం కేసీఆర్ అవకాశం ఇస్తేనే గురుకుల పాఠశాలల కోసం ఆయ‌న పనిచేశారని గుర్తుచేశారు. ప్రవీణ్‌కుమార్‌కు పదవి వస్తే రాజ్యాధికారం వచ్చినట్లా? అని కిషోర్ ప్రశ్నించారు. ప్రవీణ్‌ చేరిన పార్టీ.. యూపీలో రాజ్యాధికారం తేలేకపోయిందన్నారు. ప్రవీణ్‌ కోటు వేసుకుని అంబేద్కర్‌లా ఫీల్ అవుతున్నారని, బీజేపీ కుట్రలో భాగంగా ప్రవీణ్‌కుమార్ వస్తున్నారని గ్యాదరి కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయ‌న సోమ‌వారం నాడు మీడియాతో మాట్లాడారు.

అటు వైఎస్‌ఆర్ టీపీ అధినేత్రి షర్మిల, ఇటు ప్రవీణ్‌కుమార్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిలకు కేసీఆర్‌ను తిట్టడం ఓ ఫ్యాషన్ అయిందన్నారు. గురుకులాలు తెచ్చింది కేసీఆర్.. కానీ దాని ఫలితాన్ని ప్రవీణ్‌కుమార్ తన ఖాతాలో వేసుకున్నారని అన్నారు. బీజేపీ ప్రాంతీయ పార్టీలను విచ్చిన్నం చేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ అడ్రస్ లేకుండా పోయారని, ప్రవీణ్‌కుమార్‌కు అలాగే అవుతారని గ్యాదరి కిషోర్ జోస్యం చెప్పారు. ప్ర‌తి ఐదేళ్ళ‌కు ఒక‌సారి ఇలాంటి వారు వ‌స్తార‌ని..పోతార‌న్నారు. ద‌ళిత జాతి బాగుప‌డుతుంటే ఆగ‌మాగం చేయ‌టానికి కొంత మంది బ‌య‌లుదేరుతార‌ని విమ‌ర్శించారు. కేసీఆర్‌ను తిడితే నాయకులు కాలేరని, దళితబంధును చూసి కొందరు వణికి పోతున్నారని ఎమ్మెల్యే సైదిరెడ్డి తెలిపారు. దళిత బంధుతో ఆ వర్గాలను ఎలా బాగుచేయాలోనని.. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆలోచిస్తే బాగుంటుందని సైదిరెడ్డి సూచించారు.

Next Story
Share it