హత్య కుట్ర ప్రశాంత్ కిషోర్ స్క్రిప్ట్ ప్రకారమే

మాజీ మంత్రి, బిజెపి నాయకురాలు డీ కె అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి శ్రీనివాసగౌడ్ పై హత్య కుట్ర ప్రశాంత్ కిషోర్ స్క్రిప్ట్ ప్రకారమే జరిగిందని ఆరోపించారు. దమ్ముంటే నేరుగా కొట్లాడాలని..అంతే కానీ..మహిళల ఇంటిపై రాళ్లు వేయించుతారా అని ప్రశ్నించారు. ఇది సరైన పనో కాదో..కెసీఆర్ తన భార్య, కూతురు, మనవడిని అడగాలని సూచించారు. గట్టిగా మాట్లాడే మహిళలపై ఇలాంటి దాడులు చే్స్తారా అని ప్రశ్నించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర.. ఒక బోగస్ అని డీకే అరుణ ఆరోపించారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమని స్పష్టం చేశారు. శ్రీనివాస్ గౌడ్‌ను చంపాల్సిన అవసరం ఎవరకీ లేదన్నారు. తన అవినీతిని కప్పిపుచ్చుకోవటానికి మంత్రి తాపత్రయ పడ్తున్నారని అన్నారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ అవినీతిపై పోరాడుతోన్న వారికి కచ్చితంగా షెల్టర్ ఇస్తామని స్పష్టం చేశారు. ''రాత్రి వేళ ఇంటిపై రాళ్ళు వేయటం కాదు.. దమ్ముంటే నాపై రాజకీయంగా పోరాడాలి. ఇది బెంగాల్ కాదు.. పీకే వ్యూహాలు తెలంగాణలో పనిచేయవు. మహిళాగా కేసీఆర్ ప్రభుత్వ అరాచకాలపై పోరాడుతాను. పులిలా ఉండే పోలీస్ ఆఫీసర్ స్టీఫెన్ రవీంద్ర.. పిల్లిలా మారటం బాధాకరం'' అని డీకే అరుణ వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియా ముందుకు వచ్చి ముందే సిద్ధం చేసిన స్క్రిప్ట్ చదివారన్నారు. ఇది మంత్రి శ్రీనివాసరెడ్డిపై జరిగిన హత్య కుట్రకాదని...తమపై జరిగిన కుట్రలా కన్పిస్తోందని పేర్కొన్నారు.