Telugu Gateway
Politics

బిజెపికి చ‌ర‌మ‌గీతం పాడితేనే దేశానికి విముక్తి

బిజెపికి చ‌ర‌మ‌గీతం పాడితేనే దేశానికి విముక్తి
X

కేంద్రంలో ఉన్న‌ది దిక్కుమాలిన ప్ర‌భుత్వం అని తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసీఆర్ మండిప‌డ్డారు. తాము అడిగే ప్ర‌శ్న‌కు ఎందుకు స‌మాధానం చెప్ప‌ర‌న్నారు. తెలంగాణ‌లో వ‌రి ధాన్యం కొంటారా.. కొన‌రా? అని స్ప‌ష్టం చేయాల‌న్నారు. నిజం చెప్ప‌లేక కేంద్రం అడ్డ‌గోలు వాద‌న‌లు చేస్తుంద‌ని వ్యాఖ్యానించారు. ద‌ర్నాచౌక్ లో నిర్వ‌హించిన మ‌హాధ‌ర్నాలో కెసీఆర్ మాట్లాడారు. దేశంలో రైతుల‌ను బ‌తక‌నిస్తారా? లేదా అని ప్ర‌శ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న వారి బుర్ర‌లు ప‌నిచేయ‌టం చేయ‌టంలేద‌ని మండిప‌డ్డారు. రైతుల గోస తెలంగాణలోనే కాదు..దేశం మొత్తం ఉందన్నారు.. రైతు చట్టాలను రద్దు చేయండని ఏడాదిగా ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తున్నారని గుర్తు చేశారు. వానాకాలం పంటనే కొనే దిక్కు లేదు కానీ కేంద్ర ప్రభుత్వం యాసంగి పంటను ఎక్కడి నుంచి కొంటుందని ఎద్దేవా చేశారు. దేశాన్ని పాలించిన అన్ని పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయని ధ్వజమెత్తారు. ప్రస్తుత ఈ దుస్థితికి కారణం ఆ పార్టీలేనని విమర్శించారు. ఆక‌లి సూచీలో భారత దేశం 101 స్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌ కంటే భారత్‌ దీన స్థితిలో ఉందన్నారు. బీజేపీ అబద్ధాలు మాట్లాడుతూ అడ్డగోలు పాలన చేస్తోందని మండిపడ్డారు. 'ఐటీఆర్‌ ప్రాజెక్టు ఇవ్వమంటే ఇవ్లేదు.. ప్రతి జిల్లాకు నవోదయాలు ఇవ్వమంటే ఇవ్వలే. చాలా ఓపికతో ఉన్నాం. ఈ సభలో కూడా బీజేపీకి సీఐడీలు ఉన్నారు. నిన్న కూడా ప్రధానికి లేఖ రాసిన. వడ్లు కొంటరా, కొనరా అని అడిగితే ఉలుకు పలుకు లేదు.

రైతులు ఇబ్బంది పడతారనే యాసంగిలో వడ్లు వేయొద్దని చెప్పిన. పదవులను చిత్తు కాగితాల్లా ఎన్నిసార్లు వదిలేశామో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. రైతు చట్టాలను వెనక్కి తీసుకునే వరకు రాజీ పోరాటం చేస్తాం. అనేక సమస్యలను పెండింగ్‌లో పెట్టారు. కుల గణన చేయాలని తీర్మాణం చేసి పంపితే ఇప్పటి వరకు దిక్కు లేదు. సమస్యలను పక్కకు పెట్టి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. నీళ్లివ్వకుండా రాష్ట్రాల మధ్య తగాదాలు పెడుతున్నారు.కరెంట్‌ కోసం తెలంగాణ 30ఏళ్లు ఏడ్చింది. ప్రత్యేక రాష్ట్రం వచ్చాకే కరెంట్‌ సమస్య తీరింది. కరెంట్‌ మోటర్లకు మీటర్లు పెట్టమని కేంద్రం చెబుతోంది. రైతు కడుపు నిండా కరెంట్‌ ఇచ్చేది తెలంగాణే. బీజేపీకి చరమగీతం పాడితేనే ఈ దేశానికి విముక్తి' అని సీఎం కేసీఆర్‌ కేంద్రంపై నిప్పులు చెరిగారు. అవ‌స‌రం అయితే ఢిల్లీకి వెళ్లి మ‌రీ పోరాడ‌తామ‌న్నారు. కెసీఆర్ కు భ‌యం అంటే ఏమిటో చూపిస్తామ‌ని..కొంత మంది మాట్లాడుతున్నార‌ని..కెసీఆర్ ను భ‌య‌పెట్టే వాళ్లు ఉన్నారా? అని ప్ర‌శ్నించారు. భ‌య‌పెడితే తెలంగాణ రాష్ట్రం సాధించ‌గ‌ల‌నా అని ప్ర‌శ్నించారు.

Next Story
Share it