Telugu Gateway
Politics

తెలంగాణ‌పై మోడీకి ఫిర్యాదు

తెలంగాణ‌పై మోడీకి ఫిర్యాదు
X

తెలంగాణ స‌ర్కారు తీరుపై ఏపీ నీటిపారుద‌ల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. తాము వాళ్ల కంటే గ‌ట్టిగా..అంత‌కంటే దారుణ‌మైన భాష మాట్లాడ‌గ‌ల‌మ‌ని వ్యాఖ్యానించారు. తెలంగాణ మంత్రుల‌కు ధీటుగా స‌మాధానం చెప్ప‌గ‌ల మంత్రులు..నాయ‌కులు త‌మ ద‌గ్గ‌ర చాలా మంది ఉన్నార‌న్నారు. నీళ్ళ విష‌యం సున్నితమైన‌ది కాబ‌ట్టే సంయ‌మ‌నం పాటిస్తున్నామ‌ని తెలిపారు. మంత్రి వ‌ర్గ స‌మావేశం అనంత‌రం అనిల్ కుమార్ యాద‌వ్ మీడియాతో మాట్లాడారు. శ్రీశైలం డ్యామ్‌ నిండకూడదనే తెలంగాణ దుర్మార్గమైన చర్యల‌కు దిగుతోంద‌ని ఆరోపించారు. కేఆర్‌ఎంబీ ఆదేశాలు జారీ చేసినా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేద‌న్నారు. తెలంగాణ వ్యవహారశైలిపై ప్రధాని మోదీకి, జలశక్తి మంత్రికి లేఖలు రాస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంత దూరమైనా వెళ్తామని తెలిపారు.

''తెలంగాణ చర్యలను అడ్డుకుని తీరుతాం. అవసరమైతే ప్రాజెక్ట్‌లను కేంద్రం పరిధిలోకి తీసుకొచ్చేందుకు కూడా సిద్ధమే'' అని స్పష్టం చేశారు. ఏపీలో నిబంధనలకు లోబడే నీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని అన్నారు. రాష్ట్రానికి కేటాయించిన నీటిని మాత్రమే వాడుకుంటున్నామని స్పష్టం చేశారు. ''848 అడుగులపైన ఉంటేనే పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తీసుకోగలం.. తెలంగాణకు 800 అడుగులపైనే నీళ్లు తీసుకునే అవకాశం ఉంది.. కృష్ణా బేసిన్‌లో 15 రోజులు మాత్రమే 880 అడుగులపైన నీటి లభ్యత ఉంటుంది. ఈ అంశాలన్నింటినీ అపెక్స్‌ కౌన్సిల్‌ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లాం. ఇరిగేషన్‌ అవసరాల తర్వాతే విద్యుత్‌ ఉత్పత్తి చేయాలి' అన్నారు.

Next Story
Share it