వైఎస్ పై ప్రేమ ఇప్పుడు గుర్తుకొచ్చిందా?
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కడప జిల్లాకు ఎన్నికల వ్యవహారం పర్యవేక్షించటానికి ఒంటిమిట్ట ఆలయం సందర్శించాలనే తన కోరిక నెరవేర్చుకోవటానికి వెళ్ళారా? అని వైసీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. అసలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏమి మాట్లాడుతున్నారో అర్ధం కావటంలేదన్నారు. చంద్రబాబునాయుడు ఎజెండాలో భాగంగానే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జిల్లాల పర్యటన జరుగుతోందని అంబటి ఆరోపించారు. తనకు పదవి ఇచ్చిన చంద్రబాబు రుణం తీర్చుకోవాలని నిమ్మగడ్డ భావిస్తున్నారన్నారు. శనివారం అంబటి మీడియాతో మాట్లాడుతూ.. '' టీడీపీని చిత్తుగా ఓడించారని వైసీపీపై నిమ్మగడ్డ కక్ష సాధిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉంటున్నాయి.
జిల్లాల పర్యటనల్లో నిమ్మగడ్డ రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారు. దివంగత నేత వైఎస్సార్ అంటే తనకు అభిమానమని నిమ్మగడ్డ అంటున్నారు.. 2009లో ఆయన మరణిస్తే 2021లో నిమ్మగడ్డకు అభిమానం పుట్టుకొచ్చింది. వైఎస్సార్ విగ్రహాలకు ముసుగు వేయిస్తావ్.. పొగుడుతావ్. కడప ఎన్నికల రివ్యూకు వెళ్లి సీబీఐ కేసుల గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారు?. పెన్ను, కాగితం ఉందని లేఖలు రాస్తున్నారు.. మీడియాకు లీక్ చేస్తున్నారు'' అంటూ మండిపడ్డారు. సాక్ష్యం చెప్పొద్దని నిమ్మగడ్డను ఎవరు అడిగారని అన్నారు. అన్నీ నిజాలు చెబుతానని కోర్టులో ప్రమాణం చేయాలి కానీ మీడియా సమావేశాల్లో దీనిపై మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు.