అనంతపురం కలెక్టర్ పై వైసీపీ ఎమ్మెల్యే ఫైర్
అనంతపురం జిల్లా కలెక్టర్ గంథం చంద్రుడిపై ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ చంద్రుడు ఇగోయిస్టు అంటూ మండిపడ్డారు. గంధం చంద్రుడు ఇవాళ ఉండి రేపు పోతాడని, ఎవడిని నాశనం చేయడానికి గంధం చంద్రుడు పుట్టాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పత్రికల్లో హనీట్రాప్ రాకపోతే ఎప్పుడో పోయేవాడని వ్యాఖ్యానించారు. కలెక్టర్ కులాల మధ్య చిచ్చురేపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. జిల్లా మేజిస్ట్రేట్ అయితే చంపేస్తావా? అని కేతిరెడ్డి ప్రశ్నించారు.
ఎమ్మెల్యేలు గాడిదలు కాయడానికి ఉన్నామా?.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను కలెక్టర్ లెక్కచేయట్లేదని విమర్శించారు. సీఎంవో, మంత్రులకు కలెక్టర్ రాంగ్ ఫీడింగ్ ఇస్తున్నారని, కలెక్టర్ చేసిన పనికిమాలిన పనులు చెప్పాలంటే పేజీలు చాలవని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. కలెక్టర్ పై సీఎం జగన్ కు ఫిర్యాదు చేస్తానన్నారు. శివరాత్రి సందర్భంగా నిర్వహించే ఓ ఊరేగింపు విషయంలో వివాదం తలెత్తింది. ఈ కారణంగానే ఎమ్మెల్యే కలెక్టర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.