రాష్ట్రాన్ని జగన్ దివాళా తీయించారు
రాష్ట్ర అభివృద్ధి సంస్థ (ఏపీఎస్ డీసీ) చేసే అప్పులకు గ్యారంటీ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆర్ధిక మంత్రి బుగ్గనరాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. కేంద్రం అనుమతి కూడా అవసరం లేదని చెప్పడం విడ్డురమన్నారు. బడ్జెట్ అప్పులకు ఆర్టికల్ 293 (3) క్రింద రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా కేంద్రం నుండి అనుమతి తీసుకోవాలన్నారు. ఏ కార్పొరేషన్ ద్వారా అయినా రుణాలు తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా గ్యారంటీ ఇవ్వాల్సిందే. అలా ఇచ్చే గ్యారంటీలు రాష్ట్ర ఆదాయంలో 90 శాతం మించకూడదు. కానీ మన రాష్ట్రంలో అప్పులు, వాటికి ఇచ్చే గ్యారంటీలు పరిమితికి దగ్గర్లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ లోన్స్ కంటే ఆఫ్ బడ్జెట్ లోన్స్ చాలా ఎక్కువగా తీసుకుంటోంది. (2019-20లో రూ.77,700 కోట్లు, 2020-21లో రూ.91,000 కోట్ల బడ్జెట్ రుణాల గురించి కేంద్ర ప్రభుత్వానికి చెప్పకపోవడం చాలా పెద్ద తప్పిదం. గ్యారంటీ అవసరమే లేదన్న రాష్ట్ర ప్రభుత్వం ఎస్క్రో ఒప్పందం ఎందుకు చేసుకున్నట్లు.? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసే ప్రతి సెస్ కన్సాలిడేటెడ్ ఫండ్ కు కాకుండా.. ట్రెజరీకి జమకావాలి. కానీ.. సెస్ ద్వారా వసూలైన నిధుల్ని ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందో మంత్రి సమాధానం చెప్పాలి.
భవిష్యత్తులో అన్ని ఆదాయాలను ఎక్స్ పెండిచర్ కు సరిపోతే.. అభివృద్ధి సంక్షేమానికి తావెక్కడ.? రాష్ట్ర రెవెన్యూ పెరగకుండా.. అప్పులు దొరికే పరిస్థితి లేకుండా రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా సాధ్యమవుతుంది.? సంక్షేమ పథకాల అమలు ఏ విధంగా జరుగుతుంది.? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆర్టికల్ 202(3) ప్రకారం లెజిస్లేచర్ చట్టం చేస్తే.. ఆ మేరకు నిధులు ఖర్చు చేయాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా చేస్తున్న ఖర్చులతో రాష్ట్రంలో ఆర్ధిక సంక్షోభాన్ని సృష్టించారు. జగన్మోహన్ రెడ్డి అసమర్ధ పాలనా విధానాలతో రాష్ట్రం దివాళా తీసే స్థితికి చేరుకుంది. సంక్షేమ రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. అభివృద్ధి అడుగంటింది. రెండేళ్ల పాలనలో ప్రజల ఆదాయం పెంచే ఒక్క ప్రణాళికా వేయలేదు. ఆదాయ మార్గాలూ ఆలోచించడం లేదు. కానీ.. ఎడా పెడా అప్పులు చేస్తూ, చివరికి ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు కూడా అప్పులపైనే ఆధారపడే పరిస్థితి కల్పించారు. రాష్ట్రాన్ని సీఎం జగన్ దివాళా తీయించారని ధ్వజమెత్తారు.