విజయవాడ టీడీపీ మేయర్ అభ్యర్ధిగా కేశినేని శ్వేత
తెలుగుదేశం పార్టీ సస్పెన్స్ కు తెరదించింది. రకరకాలుగా సాగుతున్న ప్రచారాలకు చెక్ పెట్టింది. విజయవాడ మేయర్ అభ్యర్ధిగా ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేతను ఖరారు చేసింది. ఈ మేరకు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. శ్వేత విజయవాడలోని 11వ డివిజన్ నుంచి బరిలో నిలిచారు. గత కొన్ని రోజులుగా విజయవాడలోని టీడీపీ నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. అందుకే ఎంపీ నాని ఓ సారి బహిరంగంగానే మేయర్ అభ్యర్ధిగా చంద్రబాబు ఎవరిని నిర్ణయించినా అభ్యంతరం లేదన్నారు.
తాను పార్టీ కోసం...విజయవాడ కోసం పనిచేస్తానని ప్రకటించారు. ఎంపీ కేశినేని నానికి వ్యతిరేకంగా పార్టీ నేతలు బొండా ఉమ, బుద్ధా వెంకన్నలు వ్యవహరించటంతో చంద్రబాబు వారితో చర్చించినట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. మే 10న ఎన్నికలు జరగనుండటంతో చంద్రబాబు అందరికీ క్లారిటీ ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.