రిమాండ్ కు రఘురామకృష్ణంరాజు
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు రిమాండ్ కు అప్పగిస్తూ గుంటూరులోని ఆరవ అదనపు మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. 14 రోజులు అంటే..ఈ నెల 28 వరకూ ఆయనకు రిమాండ్ విధించారు. ముందుగా వైద్య పరీక్షలకు జీజీహెచ్ కు తీసుకెళ్ళి..ఆ తర్వాత ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించాలని కోర్టు ఆదేశించింది. రఘురామకృష్ణంరాజు ఆరోగ్యం మెరుగయ్యే వరకూ ఆయన్ను జైలుకు తరలించవద్దని తన ఆదేశాల్లో పేర్కొంది. ఎంపీకి ఉన్న వై కేటగిరి భద్రతను కూడా కొనసాగించాలని ఆదేశించింది.
దెబ్బలపై మెడికల్ బోర్డు ఏర్పాటు
పోలీసులు తనను దారుణంగా కొట్టారంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన ఫిర్యాదు పై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ దెబ్బలు నిన్న తగిలినవే అని తేలితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఈ దెబ్బల వెనక నిజనిజాలను తేల్చేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేసింది. ఈ బోర్డు రఘురామకృష్ణంరాజు దెబ్బలను పరిశీలించి కోర్టుకు నివేదిక అందించాల్సి ఉంటుంది. ఈ నివేదిక అనంతరం కోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.