Telugu Gateway
Andhra Pradesh

పోలవరం నిర్వాసితులపై దౌర్జన్యమా?

పోలవరం నిర్వాసితులపై దౌర్జన్యమా?
X

జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తాం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోలవరం నిర్వాసితుల అంశంపై స్పందించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన రైతులపై దౌర్జన్యం చేయటం ఏమిటని ప్రశ్నించారు. నిర్వాసితులకు అన్ని వసతులు కల్పించాకే వారిని అక్కడ నుంచి తరలించాలన్నారు. వారి సమస్యలను జాతీయ మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకెళతామన్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. 'పోలవరం ముంపు ప్రాంత పరిధిలో ఉన్న తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో అధికార యంత్రాంగం అనుసరించిన దుందుడుకు విధానాలు... జేసీబీలతో ఇళ్లను కూల్చి వేసి, ప్రజలు నివసిస్తూ ఉండగానే విద్యుత్ సరఫరా, ఇతర సదుపాయాలు నిలిపివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. పుట్టిపెరిగిన ఊళ్లను, ఉన్న ఇంటినీ, జీవనోపాధినీ, సాగు భూమిని వదిలి వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్న గిరిజనులపై ప్రభుత్వం నిర్ద్యాక్షిణ్యంగా వ్యవహరించడం కచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుంది.

పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అధ్వర్యంలో జనసేన బృందం ఆ ప్రాంతాల్లో పర్యటించి నిర్వాసితులతో మాట్లాడి అక్కడి పరిస్థితిని తెలుసుకొంది. అక్కడి ప్రజల బాధలను నాతో చర్చించారు. సీతారం గ్రామంలో ప్రజలకు పునరావాసం కల్పించకుండానే ఇళ్లను ఖాళీ చేయించేందుకు జేసీబీలతో కూల్చివేయడం గర్హనీయం. అక్కడి ప్రజలు కూలిన ఇళ్ల మధ్యనే ఉంటున్నారని తెలిసి అధికార యంత్రాంగం విద్యుత్ సరఫరా నిలిపివేయడం దుర్మార్గపు చర్య. ప్రాజెక్ట్ కోసం అన్నీ వదులుకున్నవారి పట్ల ప్రభుత్వం ఇలా వ్యవహరించడం మానవత్వం అనిపించుకోదు. ఈ విధంగా నిర్వాసితులను ఇబ్బందులకు గురి చేయడంపై తూర్పు గోదావరి జిల్లా కలెక్టరుతో పార్టీ పక్షాన మనోహర్ మాట్లాడారు. ఆ తరవాత విద్యుత్ పునరుద్ధరించారు. నామ్ కే వాస్తేగా ఇల్లు ఇస్తామని పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం, నిర్వాసితులకు ఇప్పటి వరకూ ఏ ప్రాంతంలో నిర్మిస్తామనేది చూపలేదు. కంటి తుడుపు కోసం పట్టాలు ఇచ్చి ఊరి నుంచి పంపేస్తే ఆ పేద ప్రజలు ఎక్కడ తలదాచుకోవాలి. నిర్వాసితుల కోసం కాలనీలు నిర్మించి, అక్కడ అన్ని సదుపాయాలు కల్పించడంతోపాటు 18 ఏళ్ళు నిండిన ప్రతి యువకుడినీ, యువతినీ పరిహారం ప్యాకేజీకి అర్హులుగా చేసిన తరవాతే తరలించాలి.

కచ్చులూరు, యెనుగులగూడెం నిర్వాసితులలో కొందరికి నిర్మించిన కాలనీల్లోనూ మౌలిక సదుపాయాలు నామ మాత్రంగా లేవని, ఇళ్ల నిర్మాణం కూడా నాసిరకంగా ఉందని నా దృష్టికి చేరింది. నిబంధనల మేరకు అన్ని మౌలిక వసతులను కల్పించి, పరిహారం ప్యాకేజీ పూర్తిగా అందించిన తరవాతే నిర్వాసితులను తరలించాలని నిబంధనలు చెబుతున్నాయి. వాటిని పట్టించుకోకుండా బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో పోలవరం ముంపు బాధితులకు రూ.10 లక్షలు ఆర్. అండ్ ఆర్. ప్యాకేజీ ఇస్తామని చెప్పి ఇప్పుడు రూ.6.8 లక్షలే ఇస్తున్నారని చెబుతున్న అక్కడి ప్రజలకు ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతారు? కటాఫ్ డేట్ వల్ల ముంపు గ్రామాల్లో యువతీయువకులు పరిహారం ప్యాకేజీకి దూరమైపోయారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలకు సరైన న్యాయం చేయకుండా బలవంతంగా ఖాళీ చేయించడం, ఈ క్రమంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, ప్రజల బాధలను జాతీయ మానవ హక్కుల సంఘం దృష్టికి జనసేన తీసుకువెళ్తుంది. పోలవరం ప్రాజెక్ట్ కోసం త్యాగాలు చేస్తున్నవారికి అండగా నిలుస్తాం. ' అని ప్రకటించారు.

Next Story
Share it