ఉర్సా చెప్పిన ధరనే ఏపీ కేబినెట్ ఒకే చేసిందా?!

ప్రైవేట్ కంపెనీలే ప్రభుత్వ భూముల ధరలు నిర్ణయిస్తాయా!
ఈడీబి వెంటపడి ఉర్సా ను ఏపీకి తెచ్చిందా?
కంపెనీ పెట్టిందే రెండు నెలల క్రితం అయితే ఐదు నెలల పాటు ఎలా పరిశీలించారు?
అంటే ఇది అంతా ముందే అనుకుని ప్లాన్ ప్రకారం చేశారా?
ప్రభుత్వం అయినా ..కంపెనీ అయినా ఏదైనా అంశంపై వివరణ ఇస్తే క్లారిటీ రావాలి. కానీ ఉర్సా క్లస్టర్స్ వ్యవహారం మాత్రం కంపెనీ ప్రతినిధుల వివరణ తర్వాత మరింత కాంప్లికేట్ అవుతోంది. వైజాగ్ లో వేల కోట్ల రూపాయల విలువ చేసే అరవై ఎకరాల భూమిని
కేవలం రెండు నెలల ముందు పుట్టిన ఈ కంపెనీకి కేటాయించడంపై దుమారం మొదలైన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై కంపెనీ ఇటీవల ఉర్సా క్లౌడ్ లెటర్ హెడ్ మీద ఒక వివరణ ఇచ్చింది. ఇందులోని అంశాలు మరింత షాకింగ్ గా ఉన్నాయనే చెప్పాలి . తాము 99 పైసలకే ఎకరా అడగలేదు అని వ్యంగ్యాస్త్రాలు సంధించింది అందులో. అదే సమయంలో తాము 3 .5 ఎకరాలను ఎకరా కోటి రూపాయల లెక్కన..కాపులుప్పాడ భూమిని ఎకరా 50 లక్షల రూపాయల లెక్కన ఇవ్వాలని ప్రతిపాదించినట్లు అధికారికంగా వెల్లడించారు . ఎక్కడైనా సరే రాష్ట్రంలో ఏ యూనిట్ పెట్టే ఏ సంస్థ అయినా తమకు ఎంత భూమి కావాలో అడుగుతుంది. అంతే కానీ..ఏ ధరకు ఇవ్వాలో కంపెనీ ప్రతిపాదన పెట్టదు.
ఇక్కడ మరో విచిత్రం ఏమిటి అంటే కంపెనీ ఏమి ధర ప్రతిపాదించిందో అదే ధరను ఆంధ్ర ప్రదేశ్ క్యాబినెట్ ఆమోదం తెలపటం మరింత దారుణం. అంటే ప్రభుత్వం పరిశ్రమలకు ఏ ధరకు ఎక్కడ భూమి ఇవ్వాలనే విషయాన్ని ప్రైవేట్ కంపెనీలు నిర్ణయిస్తాయా?. సహజంగా ఇలాంటి కేటాయింపులు అప్పుడు ఏపీఐఐసి ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంది. ఉర్సాకు కేటాయించిన ధర తో పోలిస్తే ఏపీఐఐసి అక్కడ కేటాయించే ధర చాలా చాలా ఎక్కువ ఉంది అని అధికార వర్గాలు తెలిపాయి. ఉర్సా క్లస్టర్స్ భూ కేటాయింపుల జీఓ ఇంకా రాకపోయినా కూడా టీడీపీ మాత్రం తన అధికారికంగా పేస్ బుక్ పేజీ లో ఈ సంస్థకు మధురవాడ లో ఎకరం కోటి చొప్పున, కాపులుప్పాడలో ఎకరం 50 లక్షల లెక్కన ఇచ్చినట్లు స్పష్టం చేసింది. అంటే ఉర్సా క్లస్టర్స్ లాంటి ఒక కొత్త కంపెనీ ఏ ధర అయితే ప్రదిపాదించిందో దాన్నే ఏపీ క్యాబినెట్ రూపాయి కూడా అటు ఇటు మార్చ కుండా ఆమోదం తెలిపింది అంటేనే ఇందులో గోల్ మాల్ ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
టిసిఎస్ కు 99 పైసలకే వైజాగ్ లో ఇచ్చిన 22 ఎకరాల భూమిని అమ్మినప్పుడు..మరి కోటి రూపాయల లెక్కన, 50 లక్షల లెక్కన ఇచ్చే భూమి అమ్మకుండా లీజ్ కు ఇస్తారా?. టిసిఎస్ కు భూమి అమ్ముతున్నట్లు ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ సి ఎన్ బీసీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో స్పష్టం చేశారు . ఒక సారి సేల్ డీడ్ జరిగిన తర్వాత ఆ భూమిని వెనక్కి తీసుకోవటం అంటే ఇంచుమించు అది జరిగే పని కాదు. రెండేళ్లలో తాము ప్రాజెక్ట్ అమలు చేయకపోతే భూమి వెనక్కి తీసుకోవచ్చు అని చెపుతున్నారు కంపెనీ ప్రతినిధులు . సేల్ డీడ్ జరిగిన తర్వాత అది సాధ్యం అయ్యే పనేనా? మొత్తం ప్రాజెక్ట్ అమలుకు ఐదు నుంచి ఆరేళ్ళు పడుతుంది అని చెపుతూ రెండేళ్ల తర్వాత భూమి వెనక్కి తీసుకోవచ్చు అని చెప్పటం ఏమైనా లాజిక్ ఉందా?. మరో వైపు తమ కంపెనీ సత్తాను ఐదు నెలల పాటు ప్రభుత్వ అధికారులు పరిశీలించారు అని చెపుతున్నారు.
అసలు కంపెనీ పెట్టే రెండు నెలలు దాటింది. అంటే కంపెనీ పెట్టక ముందే నుంచే పరిశీలన సాగింది అంటే ఇది అంతా కూడా ముందే ఒక ప్లాన్ ప్రకారం జరిగినట్లు కంపెనీ ప్రతినిధులే చెప్పకనే చెప్పినట్లు అయింది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తాము వేరే దేశాలు...రాష్ట్రాల్లో పెట్టుబడి పెట్టాలనే ఆలోచనలో ఉంటే ...ఏపీ ప్రతినిధులు తమను సంప్రదించారు అని కొత్తగా తెర మీఆదుకు వచ్చిన జై తాళ్లూరి చెపుతున్నారు. అసలు ఏ ప్రభుత్వం ఇంకా పెట్టి పెట్టని కంపెనీ వెంటపడటం అంటేనే ఇందులో ఏదో ఉంది అనే అనుమానాలు కలగటం సహజం. మొత్తానికి నారా లోకేష్ అండ్ టీం ఉర్సా క్లస్టర్స్ వ్యవహారంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పరువును జాతీయ స్థాయిలో తీశారు అనే చర్చ టీడీపీ వర్గాల్లో సాగుతోంది. జై తాళ్లూరి అసలు ఉర్సా క్లస్టర్స్ డైరెక్టర్స్ లో లేరు. కానీ ఆయన మాత్రం ప్రమోటర్ల లో ఒకరిగా చెప్పుకుని మీడియా కు క్లారిటీ ఇచ్చే పని చేశారు.