Telugu Gateway
Andhra Pradesh

కెసిఆర్ బాటలో జగన్

కెసిఆర్ బాటలో జగన్
X

వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ మోడల్ నే ఫాలో అవుతున్నారు. చాలా విషయాల్లో ఇదే ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోంది. సెక్రటేరియట్ కు రాకుండా..కనీసం సొంత ఎమ్మెల్యేలను కూడా ఎప్పుడో తప్ప కలవని జగన్....అంబేద్కర్ విగ్రహావిష్కరణ విషయంలో కూడా కెసిఆర్ పద్ధతినే అనుసరించారు. తెలంగాణాలో కూడా సచివాలయం దగ్గరలో ఎన్నికల ముందు అట్టహాసంగా భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లో అంబేద్కర్ విగ్రహం పనులు పూర్తి చేయటంలో తీవ్ర జాప్యం చేసిన అప్పటి కెసిఆర్ సర్కారు కేవలం ఎన్నికల ముందు...రాజకీయ లబ్ది కోసం హడావుడిగా పనులు చేసి విగ్రహావిష్కరణ కార్యక్రమం పూర్తి చేసింది. ఎన్నికలు అయిపోయాయి...తెలంగాణ ఫలితాలు ఎలా వచ్చాయో అందరికీ తెలిసిందే. తెలంగాణ తో పోలిస్తే ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం పనులు కొంత ఆలస్యం అయినా...తెలంగాణ అంత కాలేదు అనే చెప్పాలి. కానీ అక్కడ కూడా ఇంకా పనులు పూర్తి కాకుండానే హడావుడిగా సీఎం జగన్ శుక్రవారం ఈ విగ్రహావిష్కరణ చేయటం వెనక రాజకీయం కోణం ఉందనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. రాజధాని అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టిన జగన్ తనకు అవసరం అయిన..తనకు రాజకీయంగా పనికి వస్తాయని అనుకున్న పనులపైనే ఫోకస్ పెట్టారు అనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.

ఒక వైపు వైజాగ్ లో పర్యాటక శాఖ అవసరాల కోసం అంటూ వందల కోట్ల రూపాయలు పెట్టి కట్టిన భవనాలను తర్వాత అధికారులు సీఎం క్యాంపు ఆఫీస్ కు అనుకూలంగా ఉంటాయని తేల్చటంతో ఇది అంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగింది అనే విషయం తెలిసిందే. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయటాన్ని ఎవరూ తప్పు పట్టారు.కానీ అత్యంత కీలకమైన విషయాలను వదిలేసి ఒక ఎజెండా ప్రకారమే జగన్ ముందుకు సాగుతున్నారు అని చెపుతున్నారు. అమెరికా పేరు చెపితే స్టాట్యూ అఫ్ లిబర్టీ గుర్తుకు వచ్చినట్లు ఇండియా పేరు చెపితే విజయవాడలోని స్టాట్యూ అఫ్ సోషల్ జస్టిస్ గా అంబేద్కర్ విగ్రహం గుర్తుకు వస్తుంది అని జగన్ వ్యాఖ్యానించటం విశేషం. విజయవాడ స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసిన రెండు వందల ఆరు అడుగుల ఎత్తుతో నిర్మించిన విగ్రహాన్ని జగన్ శుక్రవారం నాడు ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ అమలుకు నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలు వ్యయం చేశారు. ఒక వైపు జగన్ సోషల్ జస్టిస్ గురించి చెప్తుంటే సొంత పార్టీ ఎమ్మెల్యే లే తమ అధికారాలన్నీ కూడా జగన్ మనుషులు లాగేసుకున్నారు అని చెపుతుండటం విశేషం.

Next Story
Share it