ఏపీలో తెలుగుదేశం కార్యాలయాలపై దాడులు
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు విమర్శల స్థాయి దాటి దాడులకు స్థాయికి చేరాయి. తెలుగుదేశం ప్రధాన కార్యాలయంతోపాటు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి నివాసంపై దాడులు జరిగాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో టీడీపీ కార్యాలయాలపై ఇదే తరహా దాడులు సాగాయి. టీడీపీ ప్రధాన కార్యాలయంతోపాటు పట్టాభి నివాసంలో భారీ ఎత్తున విధ్వంసం సాగింది. కార్యాలయాలు, నివాసాల్లో వస్తువులను లోపలికి జొరబడ్డ వారు ధ్వంసం చేశారు. మంగళవారం ఉదయం ఏపీలో గంజాయి విక్రయాలకు సంబంధించి టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి మీడియా సమావేశంలో మాట్లాడుతూ పరుష పదజాలం ఉపయోగించారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబుకు అర్ధరాత్రి నోటీసులు ఇవ్వటంపై తీవ్ర స్థాయిలో స్పందిస్తూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ పోలీసులు, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ పోలీసులు, గుంటూరు ఎస్పీకి చేతనైతే నోటీసులు ఇవ్వు అంటూ విమర్శలు చేశారు. ఇదిలా ఉంటే తాజాగా జరిగిన దాడులకు వైసీపీయే కారణం అని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం సద్విమర్శలు చేస్తే తప్పులేదని..హద్దుమీరి 151 సీట్లతో ఎన్నికైన సీఎంపై నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదని వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ నేతలకు కడుపు రగిలిపోయేలా టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే టీజెఆర్ సుధాకర్ బాబు విమర్శించారు. ఎవరితోనే రాళ్ళు వేయించే ఖర్మ తమకు లేదని..ఏదైనా ఉంటే తాము చెప్పే చేస్తామన్నారు. అయితే టీడీపీ నేతలు ఉపయోగించే భాష హద్దులు దాటుతోందన్నారు.