మతాల మధ్య చిచ్చుపెట్టే కుట్ర
ఏపీ బిజెపి ప్రెసిడెంట్ సోము వీర్రాజు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. సోము వీర్రాజు మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నేతలు మత రాజకీయాలు మానుకోవాలన్నారు. మంత్రి సోమవారం మీడియాతో మాట్లాడారు. కేంద్రం ఆదేశాలతోనే వినాయక చవితి వేడుకలపై నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. సోము వీర్రాజు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కులమతాలకతీతంగా పాలన చేస్తున్నారన్నారని మంత్రి అన్నారు. బీజేపీ నేతలకు హిందూమతంపై గౌరవం ఉంటే గతంలోనే ప్రశ్నించేవారని, ఆలయాలను కూల్చిన టీడీపీని బీజేపీ ఏనాడూ ప్రశ్నించలేదని మంత్రి వెల్లంపల్లి ధ్వజమెత్తారు.
''వినాయక చవితి చేసుకోవద్దని మేం చెప్పలేదు. దీనిపై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మతం ముసుగులో రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వంపై మతం పేరుతో బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్ మేరకే గణేశ్ ఉత్సవాలపై నిర్ణయం తీసుకున్నాం. కేంద్ర ప్రభుత్వమే కోవిడ్ గైడ్‌లైన్స్ ఇచ్చింది. గైడ్‌లైన్స్ మార్చమని కేంద్రాన్ని అడగండి. కుల,మతాల రాజకీయాలు చేసే ప్రభుత్వం మాది కాదు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగ చేసుకోమని చెప్పాం. దయ చేసి ప్రజలను రెచ్చగొట్టొదు. వినాయక చవితి అందరి పండుగ పెద్ద విగ్రహాలు, ఊరేగింపులు పెట్టకూడదని మాత్రమే సూచించాం' అని తెలిపారు.