Telugu Gateway
Andhra Pradesh

మచిలీపట్నం ఓడరేవు నిర్మాణానికి కేబినెట్ ఓకే

మచిలీపట్నం ఓడరేవు నిర్మాణానికి  కేబినెట్ ఓకే
X

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం గురువారం నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు పారిశ్రామిక పెట్టుబడి ప్రతిపాదనలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సుదీర్ఘ కాలంగా సాగుతూ వస్తున్నన మచిలీపట్నం పోర్టుకు సంబంధించి మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. రైట్స్ సంస్థ సిద్ధం చేసిన డీపీఆర్ కు ఆమోదం తెలిపారు. ఎస్పీవీతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. తొలి దశ పనులకు 5835 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి చేయనున్నారు. దీనికి 36 నెలలు గడువుగా నిర్ణయించారు. కేబినెట్ నిర్ణయాల వివరాలను వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మీడియాకు వివరించారు. చిరు వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చే 'జగనన్న చేదోడు' పథకానికి ఆమోదం తెలిపిందని అన్నారు.

దీంతోపాటు రాష్ట్రంలో భూముల రీసర్వే ప్రాజెక్టు, కొత్త ఇసుక పాలసీని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. విజయనగరం జిల్లా గాజులరేగలో.. మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 80 ఎకరాలు, పాడేరు మెడికల్ కాలేజీకి 35 ఎకరాల భూమి కేటాయింపునకు కూడా మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఉచిత నాణ్యమైన బియ్యం డోర్ డెలివరీ అంశంపై కేబినెట్ సబ్ కమిటీ నివేదికపై కూడా ఈ సందర్భంగా చర్చించింది. కేబినెట్ సబ్‌కమిటీ నివేదిక ప్రకారం నూతన ఇసుక విధానం ఉంటుందని పేర్కొన్నారు. ఇసుక తవ్వకాలకై ప్రభుత్వ సంస్థలకే తొలి ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. ఒకవేళ ప్రభుత్వ సంస్థలు ముందుకు రానిపక్షంలో టెండర్లు పిలుస్తామని తెలిపారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో కూడా ఇసుక బుక్‌ చేసుకోవచ్చని, వినియోగదారులు సొంత వాహనాల్లో నేరుగా ఇసుక రీచ్‌ నుంచే ఇసుక తీసుకు వెళ్లవచ్చని పేర్కొన్నారు. ఇక ప్రభుత్వ ధరల కంటే ఎక్కువ రేట్లకు ఇసుక అమ్మితే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ఇసుక ధరలపై ప్రజలు ఎస్‌ఈబీకి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ''ఎస్‌ఈబీని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాం.

ఎర్రచందనం టాస్క్‌ ఫోర్స్‌ ఎస్‌ఈబీకి అనుసంధానం. ఎస్‌ఈబీ పరిధిలోకి గుట్కా, జూదం, మత్తు పదార్ధాలు తీసుకువస్తాం'' అని మంత్రి తెలిపారు. నవంబర్ 24న జగనన్న చేదోడు పథకం ప్రారంభించనున్నారు. జాతీయ సహకార అభివృద్ధి సంస్ధ (ఎన్‌సీడీసీ) ద్వారా రాష్ట్ర పాడి పరిశ్రమ మౌలిక వసతుల అభివృద్ధి నిధి (డీఐడీఎఫ్‌) కింద సహకార రంగాన్ని అభివృద్ధి పరచడానికి రూ.1362.22 కోట్ల రుణానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రోజుకు 500 లీటర్లు కంటే ఎక్కువ పాల ఉత్పత్తి చేసే 9899 గ్రామాల్లో మహిళా పాల ఉత్పత్తి సంఘాల ద్వారా పాల సేకరణ. ఆయా గ్రామాల్లో బల్క్‌ మిల్క్‌ చిల్లింగ్‌ యూనిట్స్‌ (బీఎంసీయూ) ఏర్పాటుకు నిర్ణయం. 2006లో రూపొందించిన ఆంధ్రప్రదేశ్‌ ఆక్వా కల్చర్‌ సీడ్‌ (క్వాలిటీ కంట్రోల్‌) యాక్ట్‌ –2006 కు సవరణలు చేస్తూ రూపొందించిన ఆంధ్రప్రదేశ్‌ ఆక్వా కల్చర్‌ సీడ్‌ యాక్టు–2020 కు కేబినెట్‌ ఆమోదం. రైతులకు నాణ్యమైన సీడ్‌ అందించేందుకు నూతన చట్టం ద్వారా వెసులుబాటు. తద్వారా ఆక్వా రైతులకు మెరుగైన ఆర్ధిక ప్రయోజనాలు కల్పించడంతో పాటు, వినియోగదారులకు నాణ్యతతో కూడిన ఉత్పతులు అందజేయాలని నిర్ణయించారు.

Next Story
Share it