వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కేసులో తమపై కూడా రాజద్రోహం కింద కేసు నమోదు చేయటంపై తెలుగు ఛానళ్లు టీవీ5, ఏబీఎన్ లు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఏపీసీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో రఘురామకృష్ణంరాజు తర్వాత టీవీ5, ఏబీఎన్ ఛానళ్లను పెట్టిన విషయం తెలిసిందే. రఘురామకృష్ణంరాజు చేసిన విద్వేష ప్రసంగాలను ఈ ఛానళ్లు ప్రత్యేకంగా స్లాట్ కేటాయించి ప్రభుత్వాన్ని అస్థిరపర్చటానికి ప్రయత్నించాయని సీఐడీ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది.
సీఐడీ అధికారులు ఉద్దేశపూర్వకంగానే తమ ఛానల్ ను ఎఫ్ఐఆర్ లో చేర్చారని టీవీ5 తన పిటీషన్ లో పేర్కొంది. తమపై కేసు మీడియా స్వేచ్చను అడ్డుకోవటమే అని పేర్కొంది. సీఐడీ దర్యాప్తుపై స్టే విధించటంతోపాటు తమ సంస్థ ఉద్యోగులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. టీవీ5, ఏబీఎన్ లు విడివిడిగా పిటీషన్లు దాఖలు చేశాయి.