ఖమ్మం సభకు బయలుదేరిన వైఎస్ షర్మిల

Update: 2021-04-09 06:23 GMT

తెలంగాణాలో శుక్రవారం నాడు కొత్త రాజకీయ పార్టీ ప్రారంభం కానుంది. ఇప్పటికే దీనిపై కసరత్తు చేసిన వై ఎస్ షర్మిల దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఖమ్మంలో తలపెట్టిన 'సంకల్ప సభ'లో పాల్గొనేందుకు శుక్రవారం ఉదయమే ఆమె హైదరాబాద్ నుంచి భారీ కాన్వాయ్ తో బయలుదేరి వెళ్లారు. షర్మిలతోపాటు దివంగత సీఎం రాజశేఖరరెడ్డి భార్య వైఎస్ విజయమ్మ కూడా ఈ సభలో పాల్గొననున్నారు. నూతన పార్టీకి సంబంధించిన విధి విధానాలను షర్మిల ఖమ్మం సభలో ప్రకటించనుండటంతో ఈ సభపై తెలంగాణలోని రాజకీయ పార్టీల్లో ఆసక్తి నెలకొంది. ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్ సాయంత్రం ఐదు గంటలకు సభ జరగనుంది. కరోనా కారణంగా పరిమిత సంఖ్యలోనే జనం హాజరుతో ఈ సభకు అనుమతి ఇచ్చారు.

షర్మిల హైదరాబాద్ లో ని తన లోటస్ పాండ్ నివాసంలో తెలంగాణలోని పది ఉమ్మడి జిల్లాల నేతలతో వరస భేటీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో ఆమె పలుమార్లు తెలంగాణాలో రాజన్న రాజ్యం తేవాల్సిన అవసరం ఉందని..ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయటంలేదని విమర్శించారు. రైతులకు, యువతకు న్యాయం జరగాలంటే తెలంగాణలో రాజన్న రాజ్యం రావాలంటూ చెబుతున్నారు. షర్మిల పార్టీ ప్రకటన తర్వాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో..ఆమె పార్టీ వైపు వెళ్ళే నేతలు ఎవరెవరు ఉంటారో వేచిచూడాల్సిందే. ఖమ్మం వెళ్లే మార్గమధ్యంలో పలు చోట్ల షర్మిలకు వైఎస్ఆర్ అభిమానులు స్వాగతం పలికారు.

Tags:    

Similar News