పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో భారీ కుదుపు. బిజెపి ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీని టార్గెట్ చేస్తే..మమతా బెనర్జీ ఎప్పటి నుంచో అటు కేంద్రంతోపాటు ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ ఉంటారు. ఈ తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. శుక్రవారం నాడు మంత్రి పార్థ ఛటర్జీ సన్నిహితురాలి ఇంట్లో ఏకంగా 20 కోట్ల రూపాయల మేర నోట్ల కట్టలు గుట్టలుగుట్టలుగా బయటపడ్డాయి. ఈడీ దాడుల్లో ఇవి వెలుగుచూశాయి. దీంతో ఈడీ మరింత దూకుడు పెంచింది. టీచర్ల నియామక కుంభకోణంతో సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి పార్థ ఛటర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శనివారం నాడు అరెస్ట్ చేసింది. కోల్‌కతాలోని నివాసంలో సుమారు 26 గంటలకు పైగా ఆయన్ని ప్రశ్నించిన ఈడీ.. చివరకు ఈ ఉదయం అదుపులోకి తీసుకుంది. శుక్రవారం అంతా విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి పరేష్ అధికారే, ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్య.. తదితరుల ఇళ్లలో ఈడీ దాడులు కొనసాగాయి.
పార్థాతో దగ్గరి సంబంధాలున్న అర్పిత ముఖర్జీ ఇంట్లో సైతం తనిఖీలు చేపట్టి.. సుమారు రూ. 20 కోట్ల విలువైన నగదును స్వాధీనం చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. పార్థా ఛటర్జీ ప్రస్తుతం పరిశ్రమలు, వాణిజ్య శాఖలతో పాటు.. టీఎంసీ సెక్రెటరీ జనరల్‌గానూ వ్యవహరిస్తున్నారు. విద్యాశాఖ అవినీతితో పాటు తన శాఖల్లోనూ ఆయన అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిణామాలపై బిజెపి స్పందించింది. ఈడీ దాడులను బీజేపీ చేపట్టిన కుట్రపూరిత చర్యగా టీఎంసీ ఆరోపిస్తే... దీనికి బీజేపీ గట్టి కౌంటరే ఇచ్చింది. అసలు సినిమా ముందు ఉంది..ఇది ట్రైలర్ మాత్రమే అంటూ ప్రతిపక్ష నేత సువేందు అధికారి ట్విటర్‌లో ఓ ఫోటోను షేర్ చేశారు. ఇందులో మమతా బెనర్జీతోపాటు పార్ధా చటర్జీ, అర్పిత ముఖర్జీ కూడా ఉన్నారు.