విశాఖ మున్సిపల్ ఎన్నికల కోసమే రాజకీయ స్టంట్లు
విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణపై వైసీపీ నాయకులు చేస్తున్న నిరసనలు కేవలం మున్సిపల్ ఎన్నికల స్టంట్ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. 22 మంది వైసీపీ ఎంపీలకు రాష్ట్రం పట్ల నిజంగా చిత్తశుద్ధి, ప్రేమ ఉంటే స్టీల్ ప్లాంటు కోసం ఏం చేస్తారో? మీ విధానం ఏమిటో? పార్లమెంట్ సాక్షిగా చెప్పాలన్నారు. ఢిల్లీలో మాట్లాడటానికి భయపడి... ఇక్కడ మాత్రం ఓట్లు కోసం నిరసన ప్రదర్శనలు చేస్తామంటే ప్రజలెవ్వరూ నమ్మడానికి సిద్ధంగా లేరని అన్నారు. స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణపై ఆదివారం ఉదయం వీడియో సందేశంలో స్పందించారు. "కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదనలు విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని కూడా తాకాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో పరిశ్రమపై ప్రభుత్వానికి నియంత్రణ ఉంటుంది కానీ, వ్యాపారాలు చేయదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. 1970ల నుంచి లైసెన్స్ రాజ్ విధానం వల్ల.. అనుకున్న విధంగా పరిశ్రమలు నడపలేక మూతపడటం. పరిశ్రమలకు సంబంధించిన భూములను ఎవరికి వారు అమ్ముకోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంటు ఉద్యమాన్ని 22 మంది ఎంపీలు ఉన్న వైసీపీ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలి.
ఏ త్యాగాలు చేస్తే పరిశ్రమ రాష్ట్రానికి వచ్చిందో కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలి. మా వంతు కృషి మేము ఢిల్లీలో ఎలాగైతే చేస్తున్నామో... 22 ఎంపీలు ఉన్న మీరు కూడా పార్లమెంటులో దీనిపై మాట్లాడాలి. వైజాగ్ కార్పొరేషన్ ఎన్నికల కోసం పైపైన మాటలు కాకుండా చిత్తశుద్దితో పోరాటం చేయాలి. పార్లమెంటులో మాట్లాడానికి 22 మంది ఎంపీలను పెట్టుకొని... రాష్ట్రంలో నిరసన ప్రదర్శనలు చేస్తే ఏం ప్రయోజనం? రాష్ట్రం పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే వైసీపీ చెందిన 22 మంది ఎంపీలు, టీడీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు ఒక నిర్ణయం తీసుకొని పార్లమెంటు వేదికగా పోరాడండి. అప్పుడు ప్రజలు చూస్తారు, నమ్ముతారు.
అది వదిలేసి రాష్ట్రంలో నిరసన ప్రదర్శనలు చేయడం ప్రజలకు నమ్మశక్యంగా లేదు. పార్లమెంటులో మేము లేము కాబట్టి రాష్ట్రంలో నిరసనలు తెలుపుతున్నాం. 22 మంది ఎంపీలను పెట్టుకొని బలమైన పార్లమెంట్ వ్యవస్థను వదిలేసి ఇక్కడకొచ్చి నిరసనలు తెలుపుతామంటే మీకు మాకు తేడా ఏముంది? భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న మేమే హోంశాఖమంత్రితో బలంగా చెప్పగలిగాం. ఢిల్లీలో వదిలేసి విశాఖలో నిరసనలు చేయడం చూస్తుంటే వైసీపీకి చిత్తశుద్ధి లేదని నేను నమ్ముతున్నాను. వాళ్ళు చిత్తశుద్ధి నిరూపించుకోవాలనుకుంటే పార్లమెంటులో స్టీల్ ప్లాంటు గురించి మాట్లాడాలి. వైజాగ్ స్టీల్ ప్లాంటు విషయంలో ప్రజలు కోరుకునే విధంగా జనసేన పార్టీ అండగా ఉంటుంది. ఇదే మా మాట. చివరి వరకు ఇదే మాట మీద ఉంటామ"న్నారు.