కాంగ్రెస్ నేత‌ల‌కు ట్విట్ట‌ర్ షాక్

Update: 2021-08-12 06:49 GMT

ఒక‌టి కాదు..రెండు కాదు పెద్ద సంఖ్య‌లో కాంగ్రెస్ నేత‌ల ట్విట్ట‌ర్ ఖాతాలు బ్లాక్ అయ్యాయి. ఈ వ్య‌వ‌హారం రాజ‌కీయ దుమారం రేపుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారిక పేజీని ట్విట్ట‌ర్ బ్లాక్ చేసింది. దీంతో ఆ పార్టీ నేత‌లు మండిప‌డుతున్నారు. కాంగ్రెస్‌ నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ ట్విటర్‌ ఖాతాను ఇప్పటికే లాక్‌ చేసిన ట్విటర్‌ తాజాగా మరో ఐదుగురు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల అకౌంట్లను తాత్కాలికంగా బ్లాక్ చేసింది. పార్టీ మీడియా హెడ్ రణదీప్ సింగ్ సూర్జేవాలా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్, లోక్ సభలో పార్టీ విప్ మాణిక్యం ఠాగూర్, మాజీ మంత్రి జితేంద్ర సింగ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుస్మితా దేవ్ అకౌంట్లు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఈ విషయాన్ని ఆ పార్టీ నేత ప్రణవ్‌ ఝా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ట్విటర్ చీఫ్ జాక్ డోర్సే పైవిమర్శలు గుప్పించారు. తమ సీనియర్‌ నేతలతోపాటు దాదాపు ఐదు వేలమంది ఇతర నాయకులు కార్యకర్తల ఖాతాలు బ్లాక్‌ అయ్యాయని ఆరోపించిన కాంగ్రెస్‌ మోదీ సర్కార్‌పై ధ్వజమెత్తింది. మోదీజీ ఇంకెంత భయపడతారంటూ మండిప‌డింది.

దేశ స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్‌ పోరాడింది, ప్రజల ఆకాంక్షను కేవలం సత్యం, అహింసతోనే సాధించిందనీ , అప్పుడూ గెలిచాం, మళ్లీ గెలుస్తామని కాంగ్రెస్‌ తన ఇన్‌స్టా పేజీలో పేర్కొంది. ప్రజలకోసం పనిచేస్తున్న తమను ఇలాంటి చర్యలు అడ్డుకోలేవంటూ ట్విటర్‌ ఇండియాకు సవాల్‌ విసిరింది. ఢిల్లీలో ఇటీవల తొమ్మిదేళ్ల బాలిక హత్యాచార ఘటన నేపథ్యంలో రాహుల్ బాధిత బాలిక, తలిదండ్రుల ఫోటోలను షేర్‌ చేసిననేపథ్యంలో ఆయన అధికారిక ఖాతాను ట్విటర్‌ బ్లాక్‌ చేసింది. మరోవైపు బాధితు ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంపై సీరియస్‌గా స్పందించిన జాతీయ బాలల హక్కుల సంఘం రాహుల్‌పై చర్య తీసుకోవాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. కాంగ్రెస్ అధికారిక ఖాతా నిలిపివేసిన విష‌యాన్ని ఆ పార్టీ నేత‌లు ఇన్ స్టాగ్రామ్ లో స్క్రీన్ షాట్ ను షేర్ చేసి మ‌రీ విమ‌ర్శ‌లు గుప్పించారు.

Tags:    

Similar News